IT News: టెక్కీలకు గుడ్‌న్యూస్.. గ్లోబల్ లేఆఫ్స్ వల్ల లాభం.. అధిక ఉద్యోగాలు..
IT News: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులతో టెక్ రంగం భారీగా ప్రభావితం అయ్యింది. అనేక టెక్ కంపెనీలు తమ మనుగడకోసం ఖర్చులను తగ్గించుకునేందుకు లక్షల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
ఐటీ రంగంలోని మైక్రోసాఫ్ట్ నుంచి సేల్స్ ఫోర్స్ వరకు అలాగే.. బ్యాంకింగ్, టెలికాం రంగాలకు చెందిన కంపెనీలు భారీ తొలగింపులను ప్రకటించాయి. ఇదంతా ఒకపక్క బాధ కలిగిస్తున్నప్పటికీ.. ఇది భారత టెక్కీలకు కలిసొచ్చే అంశం అని చెప్పుకోక తప్పదు. నిపుణుల అంచనా ప్రకారం ఇలా లేఆఫ్ అయిన ఉద్యోగాల్లో మరికొన్ని నెలల్లో 30-40 శాతం భారత్ లాంటి ఔట్ సోర్సింగ్ హబ్‌లకు తరలిపోతాయన్నారు.

ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రస్తుతం భారతదేశంలో గుర్తింపు పొందిన పెద్ద టెక్ కంపెనీల్లోని ఉద్యోగులకు ఉపాధి అవకాశాలుగా మారతాయని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 30-40% టెక్ ఉద్యోగాలు 2024-25 నాటికి భారతదేశానికి తరలించబడతాయని ర్యాండ్‌స్టాడ్ ఇండియా, డైరెక్టర్-ప్రొఫెషనల్ సెర్చ్ అండ్ సెలెక్షన్, సంజయ్ శెట్టి తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ప్రస్తుతం తమ వ్యాపార అవసరాలు, మార్కెట్ల విస్తరణ కోసం ఇండియాలో తమ కార్యాలయాలను, కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఇది మధ్యస్థం నుంచి దీర్ఘకాలంలో భారత్ కు లాభదాయకమైనదిగా సంజయ్ శెట్టి అభిప్రాయపడ్డారు. స్టాఫింగ్ సంస్థ Xpheno డేటా ప్రకారం గడచిన 12 నెలల కాలంలో పెద్ద టెక్ కంపెనీలు తమ ఇండియన్ వర్క్ ఫోర్స్ ను 35 శాతం పెంచుకున్నట్లు వెల్లడైంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లో ఎక్కువగా ఈ ఉద్యోగాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications