Stock Market: మార్కెట్ల పతన ప్రయాణం.. చేటుచేస్తున్న రూపాయి పతనం.. ఆరంభం నుంచే బేర్ జోరు..
Stock Market Opening Bell: గతం వారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారమూ అదే దారిని ఎంచుకున్నాయి. మార్కెట్ల ప్రారంభంలోనే సూచీలు కుప్పకూలాయి. ప్రధానంగా రూపాయి పతనంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వ్యతిరేక పవనాలు వీయటం దీనికి కారణాలుగా ఉన్నాయి.

సూచీల నేలచూపులు..
స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఆరంభంలో 9.20 గంటలకు 1 శాతం మేర నష్టపోయి ఏకంగా 756 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో మరో సూచీ నిఫ్టీ 176 పాయింట్ల మేర నష్టంలో ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ భారీ పతనంతో 525 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ దారుణంగా 750 పాయింట్ల పతనాన్ని చవిచూసింది. దీనికి ప్రధానంగా అమ్మకాల ఒత్తిడి కారణంగా ఉంది.

ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు..
ఈ వారంలో మరో సారి ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే సామాన్యుల నెత్తిన వడ్డీ రేట్ల భారం మోయలేనిదిగా మారింది. వ్యాపారవేత్తలకు సైతం రుణాలు ఖరీదుగా మారుతున్నాయి. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి నెమ్మదించే ప్రమాదం ఉందని దాని వల్ల దేశాలకు ఆర్థిక చిక్కులు పెరుగుతాయని ఆర్థిక వేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇవి కూడా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

గెయినర్స్..
మార్కెట్ల ఆరంభంలో చాలా తక్కువ కంపెనీలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్టీ ఇండియా, ఇన్భోసిస్, బ్రిటానియా కంపెనీలు మాత్రం లాభాల్లో ఉంటూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

లూజర్స్..
ఈ రోజు మార్కెట్లో ఓపెన్ కాగానే అనేక కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఆరంభంలో పవర్ గ్రిడ్, హిందాల్కొ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, ఓఎస్జీసీ, టైటాన్, కోల్ ఇండియా తో పాటు మరిన్ని కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications