Market Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ.. కొత్త ఏడాది కొత్త భయాలతో కకావికలం..
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది తొలిరోజున రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. 2024లో మార్కెట్లు ఫ్లాట్ ఆరంభంతో ఒడిదొడుకులను చవిచూశాయి. ప్రధానంగా ఇన్వెస్టర్లను అనేక ఆందోళనలు, అనుమానాలు వెంటాడటంతో నేడు కుప్పకూలాయి.
ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు ఆ తర్వాత కొద్ది సేపటికే మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేశాయి. ఉదయం 11.49 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీలను పరిశీలిస్తే.. సెన్సెక్స్ 590 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 148 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 352 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 329 పాయింట్ల మేర నష్టాల్లో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

మార్కెట్ల పతనానికి కారణాలు..
ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ సబ్ వేరియంట్ JN.1 కేసులు పెరుగుదలతో పాటు, జనవరి నాలుగున అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ మినిట్స్ వివరాలు బయటకు వస్తున్న వేళ ఇన్వెస్టర్లు ఓలటాలిటీ వెలకొంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో మార్కెట్లలో అలజడి కొనసాగుతోంది. అలాగే ఈవారం అమెరికా నాన్ ఫార్మ్ పేరోల్ డేటా సైతం వస్తుండటం మార్కెట్లకు చాలా కీలకంగా మారిపోయింది. ఇది పరోక్షంగా అమెరికన్ డాలర్ల రేటును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో మెుత్తం 1141 కంపెనీల షేర్లు లాభపడగా.. దాదాపు 2030 కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి. కేవలం 88 కంపెనీల షేర్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదని వెల్లడైంది. విస్తృత మార్కెట్లలో బీఎస్ఈ స్మాల్‌క్యాప్, బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీలు కూడా 1 శాతం మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే ఇంట్రాడేలో నిఫ్టీ ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


Click it and Unblock the Notifications