Stock Market: ఊగిసలాటల్లో భారత మార్కెట్లు.. ఆ నిర్ణయంతో భగ్గుమంటున్న పెట్రో ధరలు..
Stock Market: భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఆరంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే రెండో ట్రేడింగ్ సెషన్లో కోలుకుని లాభాల్లో కొనసాగుతున్నాయి.

సూచీల కదలిక..
మధ్యాహ్నం ఒంటి గంటకు కీలక సూచీలు పచ్చరంగు అద్దుకున్నాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 41 పాయింట్లు లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు, నిఫ్టీమిడ్ క్యాప్ 186 పాయింట్లకు పైగా ఎగబాకింది.

అమ్మకాలు.. కొనుగోళ్లు..
నేడు ప్రధానంగా ఐటీ, ఎఫ్ఎమ్సీజీ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా కొంత సేపు మార్కెట్లు దిగజారాయి. ఇదే సమయంలో పవర్, హెల్త్ కేర్ రంగాల్లోని షేర్లలో అమ్మకాల జోరు కనిపించింది.

క్రూడ్ ఆయిల్ ధరలు..
ముడి చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో రోజుకు లక్ష బ్యారెళ్ల మేర ఉత్పత్తి తగ్గించాలని పేర్కొంది. ఉత్పత్తిని అగష్టు స్థాయిలకు పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. ఈ కారణంగా రానున్న కాలంలో ఇంధన ధరలు మరింత భారంగా మారనున్నాయి.

రష్యాకు హ్యాండ్ ఇస్తున్న భారత్..
రానున్న కాలంలో భారత ఇంధన అవసరాలు ఒపెక్ దేశాలే తీరుస్తాయని.. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో రష్యా నుంచి పెరిగిన ఆయిల్ దిగుమతులు.. ఆ తర్వాత జూలైలో తగ్గాయి. జూలైలో ఎక్కువగా సౌదీ నుంచే క్రూడాయిల్ దిగుమతులను భారత్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications