Stock Market: వారాంతంలో మార్కెట్ల ఊగిసలాట.. చైనా, జపాన్ వల్లనే..!!
Stock Market: గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాల్లో ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో ఆసియా మార్కెట్లలో కల్లోలం ప్రారంభమైంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 220 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 68 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 132 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసి ముందుకు సాగుతోంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 26 పాయింట్లు కోల్పోయి ఇంట్రాడేలో కొనసాగుతోంది.

జపాన్ ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుండటం, చైనా రియల్టీ మార్కెట్ నీరసించటం వంటి విషయాలు సైతం ప్రపంచ స్థాయిలో ప్రతికూలతలకు కారణంగా నిలుస్తున్నాయి. అలాగే ఆగస్టు 17న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,510.86 కోట్లు విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దేశంలోని సంస్థాగత పెట్టుబడిదారులు సైతం రూ.313.97 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు వెల్లడైంది. దీనికి తోడు అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడింగ్ ముగించటం ఓలటాలిటీని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు.
ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, సిప్లా, ఎల్ టి, జేఎస్డబ్యూ స్టీల్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, టైటాన్, హిందుస్థాన్ యూనీలివర్, ఎయిర్ టెల్, యూపీఎల్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, టీసీఎస్, హీరో మోటార్స్, ఎస్బీఐ లైఫ్, విప్రో, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హిందాల్కొ, ఎల్ టిఐఎమ్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, గ్రాసిమ్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications