Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లలో విధ్వంసం మెుదలైంది. నిన్న ఊహించిన విధంగానే మార్కెట్లు బేర్ మంటున్నాయి. అమెరికా ఫెడ్ ప్రసంగం తరువాత అక్కడి మార్కెట్లు కుప్పకూలినట్లుగానే.. ఈ రోజు దేశీయ మార్కెట్లు నడుస్తున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ సూచీ ఏకంగా 1250 పాయింట్లు నష్టపోయింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 380 పాయింట్లను కోల్పోయింది.
సోమవారం మార్కెట్లు ఓపెన్ కావటంతోనే విధ్వసం మెుదలైంది. ప్రధాన సూచీలకు అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ స్పీచ్ ప్రభావం తీవ్రంగా తగిలింది. US ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ ప్రసంగంతో అమెరికా మార్కెట్లు తీవ్రంగా నష్టపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది. ప్రధానంగా మరింత రేట్ల పెంపులు ఉంటాయని ఆయన వెల్లడించటం ద్రవ్యోల్బణం తీవ్రతను చూపుతోంది.

నిఫ్టీ-50లోని స్టాక్స్ ను పరిశీలిస్తే.. ప్రధానంగా కేవలం ఒక్కస్టాక్ మాత్రమే స్వల్పంగా లాభాల్లో ఉంది. అదే బ్రిటానియా ఇండస్ట్రీస్. ఇది ఒక్కటి మాత్రమే టాప్ గెయినర్ గా నిలిచింది. ఇదే క్రమంలో.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, టీసీఎస్, హిందాల్కొ, విప్రో, జిందాల్ స్ట్రీల్, టాటా స్టీల్ తో పాటు దిగ్గజ బ్యాంకింగ్ స్టాక్ నేల చూపులు చూస్తూ ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఉదయం 9.30 గంటల సమయంలో బ్యాంక్ నిఫ్టీ 797 పాయింట్ల పతనంతో ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నెలాఖరులో మార్కెట్లు కోలుకుంటాయని మార్కెట్ వర్గాలు భావించినప్పటికీ.. ఫెడ్ నిర్ణయాల కారణంగా ట్రెండ్ ఒక్కసారిగా మారింది. ఇదే సమయంలో రూపాయి సైతం రికార్డు కనిష్ఠాలకు చేరుకుంది. డాలర్ మరింత బలపడటం కారణంగా ఐటీ కంపెనీలకు కాసులవర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications