Bear Markets: ఉదయం తక్కువ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు కొన్ని గంటల్లోనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకపక్కన కొనసాగుతున్న ఎన్నికల మార్కెట్ ఓలటాలిటీతో కీలక సూచీలు నేలచూపులు చూస్తున్నాయి.
మధ్యాహ్నం సమయంలో 12.38 గంటలకు మార్కెట్లు క్షీణతను కొనసాగిస్తున్నాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 448 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 149 పాయింట్లను నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 171 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 322 పాయింట్ల పతనాన్ని కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి నేడు ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లోని కంపెనీల షేర్ల పతనం మార్కెట్లను మరింత నష్టాల్లోకి నెట్టేసింది. ఈ క్రమంలో ఎల్ అండ్ టి, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

మార్కెట్ ట్రేడింగ్ ఇంట్రాడే సమయంలో నేడు నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ టాప్ లూజర్ స్థానంలో నిలిచింది. ఇది ఏకంగా 1.72 శాతం క్షీణతను నమోదు చేసింది. దీని తర్వాత నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, మీడియా అండ్ మెటల్ సూచీలు దాదాపు 1 శాతం మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే నిఫ్టీ ఆటో రంగం మాత్రం 1.7 శాతం వృద్ధితో ముందుకు సాగుతోంది. ఇంట్రాడేలో గరిష్ఠంగా సెన్సెక్స్ సూచీ 500 పాయింట్లకు పైగా పతనమైంది.
ఇదే క్రమంలో దేశంలోని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించిన ఏప్రిల్ నెల డేటా పరిసీలిస్తే నికర పెట్టుబడులు ఏప్రిల్ నెలలో రూ.18,888 కోట్లుగా నమోదైంది. అయితే మార్చి నెలలో పెట్టుబడుల విలువ రూ.22,576 కోట్ల కంటే ఇది చాలా తక్కువ. ఏప్రిల్ నెల డేటా ప్రకారం.. మెుదటి స్థానంలో ఉన్న హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడులు రూ.19,863 కోట్లుగా నిలిచాయి. రెండవ స్థానంలో నిలిచిన ఈటీఎఫ్ పెట్టుబడులు రూ.5,747 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన ఈఎల్ఎస్ఎస్ ఫండ్లలో పెట్టుబడులు ఏప్రిల్ మాసంలో రూ.144 కోట్లకు పరిమితమయ్యాయి.


Click it and Unblock the Notifications