Market Opening: ఈవారం ప్రారంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రధానంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరుతో మార్కెట్లలో రక్తపాతం మెుదలైంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 480 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 146 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 476 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 587 పాయింట్ల మేర నష్టాల్లో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లను సైతం యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇవి మార్కెట్లను భారీ నష్టాలతో అతలాకుతలం చేస్తున్నాయి.

NSEలో ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, నెస్లే, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు ఈ క్రమంలో లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. అలాగే అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, హిందాల్కొ, హీరో మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో అమెరికా బాండ్ ఈల్డ్స్ మరింతగా పెరుగుదలను కొనసాగిస్తున్నాయి. 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్ 4.799 శాతం, రెండు సంవత్సరాల ట్రెజరీ బాండ్స్ 5.085 శాతం అత్యధిక రాబడిని అందిస్తున్నాయి. దీంతో విదేశీ మదుపరులు తమ డబ్బును బాండ్స్ మార్కెట్లో పార్క్ చేసేందుకు మక్కువ చూపుతూ ఈక్విటీల నుంచి నిష్ర్కమిస్తున్నారు. ఈ ధోరణి అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి మార్కెట్లకు చేటు చేస్తోంది. విదేశీ మదుపరులు అందుకే లాభాలను స్వీకరిస్తూ తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications