Sensex Crash: భారీ నష్టాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్ల క్రాష్.. ఎందుకు?
Stock Markets Crash: నవంబర్ నెల మెుదటి తారీఖున ముహురత్ ట్రేడింగ్ సమయంలో మార్కెట్ల లాభాల ప్రయాణంతో అందరినీ ఊరించిన సంగతి తెలిసిందే. అయితే నేడు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు తర్వాత కొద్ది సేపటికే భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. మార్కెట్లో హెవీ వెయిట్ స్టాక్స్ నష్టాలు సూచీలను కిందికి లాగుతున్నాయి.
వాస్తవానికి రేపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల జరగనున్న వేళ నేడు భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూస్తున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఉదయం 10.17 గంటల సమయంలో 1011 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 325 పాయింట్ల మేర నష్టంలో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 371 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 741 పాయింట్ల మేర పతనాన్ని చూశాయి. ఇంట్రాడేలో ప్రారంభం నుంచే దలాల్ స్ట్రీట్ లో బేర్స్ తమ ఆధిక్యాన్ని కొనసాగించటంతో అనేక స్టాక్స్ నష్టాలతో బేజారాయి.

ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలను పరిశీలిస్తే.. ఈ వారం రాడార్‌లో ప్రధాన సంఘటన నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు కాగా.., ఆ తర్వాత నవంబర్ 7న ఫెడ్ ద్రవ్య విధానానికి సంబంధించిన ప్రకటన రానుంది. ఈసారి కూడా అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నప్పటికీ.. అది పావు శాతం పాయింట్ల కట్ అంటే 25 బేసిస్ పాయింట్లు మాత్రమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పెట్టుబడిదారులను ఎడ్జ్‌లో ఉంచాయి. అమెరికా చరిత్రలో అత్యంత గట్టిగా పోటీపడిన ఎన్నికల్లో ఒకటిగా పేర్కొనబడిన ఈ ఫలితం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో విధానాలను రూపొందించడంలో, ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇన్వెస్టర్లు చైనా ఉద్దీపనపై దృష్టి సారించారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్-చైనా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఐదు రోజుల సమావేశం ముగిసిన తర్వాత వాటి వివరాలను శుక్రవారం ప్రకటించే అవకాశం ఉన్నందున గ్లోబల్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో పెరిగిన చమురు ధరలు కూడా మార్కెట్లలో అలజడి సృష్టిస్తున్నాయి.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతుండగా.. హీరో మోటార్స్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, బీపీసీఎల్, రిలయన్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, హిందాల్కొ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications