Market Crash: బుల్‌రన్‌కి బ్రేక్.. నష్టాలతో కుప్పకూలిన Sensex, Nifty..
Stock Market: గణేష్ చతుర్థి సెలవు తర్వాత నేడు ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని భారీ నష్టాలతో మెుదలుపెట్టాయి. ప్రధానంగా అమెరికాతో పాటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగటం దీనికి కారణంగా నిలిచింది.
గిఫ్ట్ నిఫ్టీ సూచీతో పాటు ప్రీట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు భారీ నష్టాల బాట పట్టాయి. ఈ క్రమంలో ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సెన్సెక్స్ 496 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 147 పాయింట్ల నష్టాలతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 381 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 339 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతున్నాయి. మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కారణంగా కరెక్షన్ జరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఈరోజు రాత్రి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో ఫలితాల ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తం అవుతున్నారు. దీంతో బుధవారం గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు సైతం బలహీనమైన ప్రారంభాన్ని సూచించాయి. అమెరికా కీలక వడ్డీ రేట్ల విషయంలో పెంపు ప్రకటన చేస్తుందేమోననే కలవరం ఇన్వెస్టర్లను ఆవరించింది. దీంతో చాలా మంది తమ పెట్టుబడులను విక్రయించి లాభాలను స్వీకరించేందుకు పోటీ పడుతున్నారు.
ఈ క్రమంలో ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టి, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, యూపీఎల్, టైటాన్, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, గ్రాసిమ్, నెస్లే, మారుతీ, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ ఇంట్రాడేలో టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications