Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. బేర్స్ దెబ్బతో 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
Bear Market: అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ చేసిన ప్రకటన భారత స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలానికి దారితీసింది. ప్రధాన సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. బేర్స్ రంగంలోకి దిగటంతో భారీ నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
మధ్యాహ్నం 11.52 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 638 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 194 పాయింట్ల మేర క్షీణించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 533 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 380 పాయింట్లను కోల్పోయాయి. ఆసియా మార్కెట్లలో సైతం భారత స్టాక్ మార్కెట్ల మాదిరిగానే నష్టాల ట్రెండ్ కొనసాగుతోంది.

అమెరికా రేటింగ్స్ డౌన్‌గ్రేడ్ వార్తల కారణంగా US డాలర్ ఇండెక్స్ దాదాపు 102కి పెరగడంతో పాటు బెంచ్‌మార్క్ 10 ఏళ్ల బాండ్‌పై US ఈల్డ్ 4 శాతానికి పైగా పెరిగాయి. దీంతో బలహీనమైన సెంటిమెంట్ ఆసియా మార్కెట్లంతటా వ్యాపించింది. భారత మార్కెట్లతో పాటు.. జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ దిగజారాయి. గతవారం ఫెడ్ రేట్లను పెంచుతూ రానున్న కాలంలో పెంపు కొనసాగవచ్చని సూచించటం అనిశ్చితి వ్యాప్తికి కారణమైంది.
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గు చూపటంతో ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 2 శాతం మేర నష్టపోయాయి. ఇదే క్రమంలో హీరో మోటొకార్ప్ కంపెనీ షేర్లు 4 శాతం వరకు పడిపోయాయి. ఆటోమొబైల్స్, బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్స్, ఫార్మా వంటి రంగాలు నష్టాలతో ఇంట్రాడేలో పోరాడుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు సైతం 1 శాతం మేర క్షీణతను నమోదు చేశాయి.


Click it and Unblock the Notifications