Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ చూడని దూకుడును గత కొన్ని నెలలుగా చూపిస్తున్నాయి. ప్రపంచ అస్థిరత్వంతో పోరాడుతున్న సమయంలో విదేశీ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారటం దీనికి కలిసొస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలోనే నేడు భారత స్టాక్ మార్కెట్లు హాంకాంగ్ మార్కెట్లను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే 4న అతిపెద్ద ఈక్విటీ మార్కెట్లుగా అవతరించాయి. భారత్ ఈ స్థానాన్ని అందుకోవటం ఇదే తొలిసారని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. డేటా ప్రకారం భారతీయ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయబడిన షేర్ల మెుత్తం విలువ సోమవారం ముగింపు నాటికి 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో హాంకాంగ్ మార్కెట్ల విలువ కేవలం 4.29 ట్రిలియన్లుగా ఉంది.

భారతదేశ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డిసెంబర్ 5న మొదటిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది. వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ బేస్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న ఇన్‌ఫ్లోలు, బలమైన కార్పొరేట్ ఆదాయాలు, పటిష్టమైన నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్‌లో ర్యాలీ నెలకొంది. ఇదే క్రమంలో భారత్ చైనాకు ప్రత్యామ్నాయంగా నిలవటం కలిసొచ్చే అంశంగా మారింది. అలాగే దేశంలో స్థిరమైన రాజకీయ వాతావరణం ఉండటం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింతగా పెంచుతోంది.
మరోవైపు చైనా అత్యంత ప్రభావవంతమైన, వినూత్నమైన కొన్ని కంపెనీలు జాబితా చేయబడిన హాంకాంగ్ మార్కెట్లు క్షీణించాయి. ఐపీవోలను ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వేదిక హోదాను ప్రస్తుతం హాంకాంగ్ కోల్పోయింది. చైనీస్, హాంకాంగ్ స్టాక్‌ల మొత్తం మార్కెట్ విలువ 2021లో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుంచి ప్రస్తుతం 6 ట్రిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది. కరోనా సమయంలో చైనా అవలంభించిన నియంత్రణ పద్ధతులు, రియల్టీ సంక్షోభం, ఇతర దేశాలతో రాజకీయ వైరుద్యాలు చైనాకు పెద్ద చేటు చేశాయి.


Click it and Unblock the Notifications