సత్తాచాటిన ఇండియన్ స్టాక్ మార్కెట్.. మరోమారు ఐదో అతిపెద్ద మార్కెట్‌గా అవతరణ
Stock Market: అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ గ్రూపు కంపెనీల్లో ఏర్పడిన సంక్షోభం అందరికీ తెలిసిందే. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ సంక్షోభం భారతీయ ఈక్విటీ మార్కెట్ పై పెను ప్రభావాన్ని చూపింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న ఇండియన్ మార్కెట్.. తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ఇప్పుడు తిరిగి తన స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
ప్రస్తుతం అదానీ గ్రూపు స్టాక్స్ వేగంగా పుంజుకుంటూ ఉండటంతో.. ఇండియన్ మార్కెట్లకు మరోసారి మంచి రోజులు వచ్చినట్లైంది. ఫ్రాన్స్ ను వెనక్కి నెట్టి, తాను కోల్పోయిన ఐదవ అతిపెద్ద స్థానాన్ని తిరిగి పొందింది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ ప్రకారం.. మేలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు 4.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత నెలతో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ.

44.54 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా కొనసాగుతోంది. అనంతరం 10.26 ట్రిలియన్లతో చైనా, 5.68 ట్రిలియన్లతో జపాన్, 5.14 ట్రిలియన్లతో హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత శుక్రవారం నాటికి దేశీయ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
చైనాను కాదని పెట్టుబడిదారులు ఇండియాను ఎంచుకోవడమూ దీనికి ఓ కారణంగా తెలుస్తోంది. అనేక విదేశీ సంస్థలు సైతం చైనా నుంచి తమ ఇన్వెస్ట్ మెంట్ ను భారతీయ స్టాక్స్ లోకి మళ్లిస్తున్నాయి. బీజింగ్ లోని కఠినమైన కోవిడ్ -19 విధానాలు, రియల్ ఎస్టేట్ పరిశ్రమలో గందరగోళం, అక్కడి విలువైన సాంకేతిక సంస్థలపై వ్యతిరేక ప్రచారం వెరసి.. మదుపర్ల మనోభావాలను మార్చివేసినట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications