fuel delivery: ప్రతి రంగంలోనూ కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తోంది. తద్వారా వివిధ స్టార్టప్ లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ట్రక్కు డ్రైవర్లు తలపెట్టిన సమ్మె మరో నూతన ఐడియాలకు అవకాశం కల్పించింది. ఇప్పటికే అమలవుతున్నప్పటికీ ప్రజల్లో ఇప్పుడు ఆసక్తి పెరిగింది.
భారతీయ న్యాయ సంహిత కింద కొత్తగా తీసుకురానున్న హిట్ అండ్ రన్ చట్టాలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇంధన కొరతను ఎదుర్కొన్నారు. దీంతో చాలా మంది తమ వాహనాల ట్యాంకులను నింపడానికి బంకుల వద్దకు పరుగెత్తాల్సి వచ్చింది.

పొడవైన క్యూలు కొనసాగుతున్న తరుణంలో డోర్-టు డోర్ పెట్రోల్ మరియు డీజిల్ డెలివరీ గురించి యువత ఆలోచించడం మొదలుపెట్టారు. సుదీర్ఘ ప్రయాణాల్లో, టూర్ ప్లాన్ చేస్తుంటే లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ తరహా ఇంధన సరఫరా ప్లాట్ ఫారమ్ లు సహాయకారిగా ఉంటాయని భావిస్తున్నారు.
ఇండియాలో ఇంధన డెలివరీ యాప్‌లు ఇప్పటికవరకు పెద్దగా లేవు. అయితే వాణిజ్య మరియు వ్యాపార సంస్థలకు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి లైసెన్స్ పొందిన విక్రేతల ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ డోర్‌స్టెప్ డెలివరీ చేస్తున్నారు. ఇదే సౌకర్యాన్ని విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని పలు స్టార్టప్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి.
ఫ్యూయల్ బడ్డీ, హమ్ సఫార్, పెప్ ఫ్యూయల్స్, రెపోస్ ఎనర్జీ వంటి స్టార్టప్ కంపెనీలు ప్రస్తుతం దేశంలో ఇంధన డెలివరీ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇవి ప్రధానంగా ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరుల్లోనే ఉన్నాయి. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని ఇతర నగరాల్లోనూ డిమాండ్‌ను బట్టి ఈ సేవలు అందించడానికి మరిన్ని స్టార్టప్‌లు త్వరలోనే పుట్టుకొస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications