కరోనా ఉన్నా దుమ్ము రేపిన ఇండియన్ స్టార్టప్ కంపెనీలు.. ఎందులోనో తెలుసా?
కరోనా వైరస్ దెబ్బకు మొత్తం ప్రపంచమే గడగడలాడుతోంది. అన్ని రంగాలు ఈ మాయదారి మహమ్మారి దెబ్బకు కుదేలవుతున్నాయి. ఇందుకు స్టార్టుప్ కంపెనీలు అతీతమేమి కాదు. కానీ, కొన్ని ఇండియన్ స్టార్టుప్ కంపెనీలు మాత్రం ఇంతటి క్లిష్టసమయంలోనూ తమ ప్రతిభ చాటాయి. ఇన్వెస్టర్ల మదిని దోచి భారీగా పెట్టుబడులను సాధించాయి. ఇండియాలో లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే .. అది కూడా ఒక్క ఏప్రిల్ నెలలోని ఒక్క వారం రోజుల్లోనే మన స్టార్టుప్ కంపెనీలు ఏకంగా 119 మిలియన్ డాలర్ల (సుమారు రూ 900 కోట్లు) పెట్టుబడులు సమీకరించి ఔరా అనిపించాయి.
నిధులను సమీకరించిన స్టార్టుప్ కంపెనీల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ అగ్రిగేటర్ నో బ్రోకర్ తో పాటు ప్రముఖ న్యూస్ అగ్రిగేటర్ డైలీ హంట్ కూడా ఉండటం విశేషం. ఈ మేరకు స్టార్టుప్ డీల్స్ ట్రాకింగ్ సంస్థ ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనం వెలువరించింది. దాని ఆధారంగా గత వారంలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు పొందిన ఇండియన్ స్టార్టుప్ కంపెనీల వివరాలు మీ కోసం.

నో బ్రోకర్...
ఆన్లైన్ లో రియల్ ఎస్టేట్ రెంటల్స్ విభాగంలో సేవలు అందిస్తున్న నో బ్రోకర్ .. గత వారం లో అత్యధికంగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. ఈ కంపెనీకి 30 మిలియన్ డాలర్లు (రూ 216 కోట్లు) పెట్టుబడులు అందాయి. జనరల్ అట్లాంటిక్ అనే సంస్థ ఆధ్వర్యంలో తాజా పెట్టుబడులు సమకూరాయి. ఈ రంగంలోకి ఆలస్యంగా ఎంటర్ అయినా... వేగంగా ప్రజాదరణ పొందుతోంది ఈ సంస్థ.

ఫార్ ఐ ...
లాజిస్టిక్స్ మానేజ్మెంట్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఫార్ ఐ ... సిరీస్ - డి విభాగంలో 25 మిలియన్ డాలర్ల (రూ 180 కోట్లు) నిధులను సమీకరించింది. ఇందులో మైక్రోసాఫ్ట్ వెంచర్ ఫండ్ అయిన ఎం12, ఎయిట్ రోడ్ వెంచర్స్, హనీ వెల్ వెంచర్స్ తో పాటు ఇప్పటికే ఇందులో ఇన్వెస్ట్ చేసిన సైఫ్ పార్టనర్స్ కూడా పాల్గొన్నాయి.

డైలీ హంట్ ...
గత వారం ఇండియన్ స్టార్టప్ కంపెనీలు సమీకరించిన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల్లో ప్రముఖ న్యూస్ అగ్రిగేటర్ డైలీ హంట్ మూడో స్థానంలో నిలించింది. ఈ సంస్థ ఏకంగా 24 మిలియన్ డాలర్ల (సుమారు రూ 173 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. ఇందులో ఇప్పటికే కంపెనీలో ఇన్వెస్టర్లుగా కొనసాగుతున్న బైట్ డాన్స్, ఫాల్కన్ ఎడ్జ్, గోల్డ్మన్ సాచ్స్ , అడ్వాన్ట్ మానేజ్మెంట్ అనే సంస్థలు పాల్గొన్నాయి. తాజా వార్తలను వివిధ పత్రికలూ, వెబ్సైట్ల నుంచి సేకరించి మొబైల్ ఆప్ లో అందించే డైలీ హంట్ కు ఇండియా లో విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

బాక్స్ 8...
పూర్తి స్థాయి ఫుడ్ టెక్నాలజీ ప్లాట్ఫారం సేవలు అందించే స్టార్టుప్ కంపెనీ ఐన బాక్స్ 8... 4 మిలియన్ డాలర్ల ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. ఐఐఎఫ్ఎల్ సీడ్ వెంచర్ ఫండ్ అనే సంస్థ నుంచి ఈ నిధులను సమీకరించింది. ఇందులో మే ఫీల్డ్ అనే సంస్థ కూడా పాల్గొంది.

సేతు..
ఫైనాన్సియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సేతు ... గత వారంలో 14.56 మిలియన్ డాలర్ల ఫండింగ్ ను సాధించింది. ఇందులో లైట్ స్పీడ్ వెంచర్ పార్టనర్స్ పెట్టుబడులు పెట్టింది.

కాపిటల్ ఫ్లోట్...
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సేవలు అందిస్తున్న కాపిటల్ ఫ్లోట్ కూడా గత వారంలో మెరుగైన పెట్టుబడులను రాబట్టింది. ఎక్సిస్టింగ్ ఇన్వెస్టర్ల నుంచి 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. ఇందులో రాబిట్ కాపిటల్, సైఫ్ పార్టనర్స్, సేకోయ కాపిటల్, అమెజాన్ లు పెట్టుబడులు పెట్టాయి.

వెల్ది థెరపీటిక్స్ ...
డిజిటల్ థెరపీటిక్స్ సేవలు అందించే వెల్ది థెరపీటిక్స్... 4.2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. ఇందులో మన తెలుగు ఇన్వెస్టర్ సంస్థ సామా కాపిటల్ పెట్టుబడులు పెట్టటం విశేషం.
అవెనీర్ అనే సాస్ బేస్డ్ సోర్స్ టూ పే సోలుషన్స్ కంపెనీ కూడా 2 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. ఇవి కాకుండా డిజిటల్ మీడియా పబ్లిషర్ ది మార్నింగ్ కాంటెక్స్ట్, లొకేషన్ అనలిటిక్స్ స్టార్టుప్ లోకల్ ఏఐ, క్రెడిట్ ఎనేబుల్, బీ లైవ్, పవర్ గుమ్మిస్ అనే సంస్థలు కూడా గత వారంలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు సమీకరించాయి. అయితే, అవి ఎంత మొత్తంలో పెట్టుబడులు సేకరించింది వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications