Koo Shut Down: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ పోటీదారుగా స్వదేశంలో నిర్మించబడిన స్టార్టప్ మీడియా స్టార్టప్ Koo తన వ్యాపారాన్ని క్లోజ్ చేయాలని నిర్ణయించింది. కంపెనీని విక్రయించేందుకు జరిపిన సుదీర్ఘ చర్చలు విఫలం కావటంతో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి కంపెనీ 2019లో రాధాకృష్ణ, బిదవత్కచే స్థాపించబడినప్పటికీ.. 2020లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దిల్లీలో రైతులు నిరసనలు చేపట్టిన సమయంలో కొన్ని వీడియోలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను కోరగా దానికి నిరాకరించటంతో ఏర్పాడిన ప్రతిష్ఠంభన సమయంలో కూ యాప్ ఫేమస్ అయ్యింది. ఆ సమయంలో చాలా మంది కేంద్ర మంత్రులు, ప్రముఖులు స్వదేశీ యాప్ అధికారికంగా వినియోగించాలని నిర్ణయించటంతో యూజర్ల సంఖ్య పెరిగింది.

అయితే తాజాగా కంపెనీ సుదీర్ఘ ప్రయాణం తర్వాత సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడటంపై కంపెనీ సహ వ్యవస్థాపకులు రాధాకృష్ణ, మయాంక్ బిదవత్కా స్పందిస్తూ.. తాము అనేక పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు, గ్రూప్స్, మీడియా సంస్థలతో భాగస్వామ్యాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. అయితే చర్చలు తాము కోరుకున్న ఫలితాలను అందించలేదని లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. వాస్తవానికి తాము యాప్‌ను కొనసాగించాలని అనుకున్నామని, సోషల్ మీడియా యాప్‌ను నిర్వహణకు సాంకేతిక సేవల ధర ఎక్కువగా ఉండటంతో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
కంపెనీ 2022 నవంబరులో బ్రెజిల్ మార్కెట్లోకి సైతం ప్రవేశించింది. కంపెనీ ప్రస్తుతం తన ఆస్తులను డిజిటల్ పబ్లిక్ గూడ్ గా మార్చేందుకు యోచిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకులు చెప్పారు. తక్కువ కాలంలోనే సంక్షిష్ఠమైన టెక్నాలజీలను తాము నిర్మించగలిగామని వారు పేర్కొన్నారు. భారతదేశం సోషల్ మీడియాలోకి ప్రవేశించడానికి గొప్ప దృక్పథం ఉన్న వారితో ఈ ఆస్తులలో కొన్నింటిని పంచుకోవడానికి మేము సంతోషిస్తామన్నారు.
సెప్టెంబరు 2022లో కూ మొదటి సారిగా దాదాపు 40 మంది ఉద్యోగులను తొలగించడంతో కూలో కష్టకాలం మొదలైంది. ఫిబ్రవరి 2023లో సహ వ్యవస్థాపకుడు బిడవత్కా మరిన్ని తొలగింపులు వస్తున్నాయని ఉద్యోగులను హెచ్చరించారు. జనవరి 2023లో కూ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య దాదాపు 4.1 మిలియన్ల నుంచి ఫిబ్రవరిలో 3.5 మిలియన్లకు, మార్చిలో మళ్లీ 3.2 మిలియన్లకు పడిపోయింది. అయితే జూలై 2022లో కంపెనీ గరిష్ఠంగా 9.4 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. టైగర్ గ్లోబల్-మద్దతుగల కంపెనీ ఇప్పటివరకు Accel, 3one4 క్యాపిటల్, నావల్ రవికాంత్, బాలాజీ శ్రీనివాసన్, కలారి క్యాపిటల్,అనేక ఇతర సంస్థల నుంచి 65 మిలియన్ డాలర్లను సేకరించింది.
అయితే కంపెనీ తన వ్యాపారాన్ని కొనసాగించేందుకు చేసిన కొనుగోలు ప్రయత్నాల్లో భాగంగా Dailyhunt, Sharechat వంటి స్టార్టప్‌లతో అనేక చర్చలు జరిపింది. అయితే అవి చివరికి విఫలం కావటంతో చివరికి మూసివేత నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ వద్ద వేగంగా క్యాష్ బర్న్ కావటంతో చివరికి దుకాణం సద్దేయాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications