Paid Leaves: సాధారణంగా కంపెనీలు కావాల్సినప్పుడు సెలవులు ఇచ్చేందుకే చాలా ఆలోచిస్తుంటాయి. అలాంటిది దేశీయ సోషల్ యాప్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. తమ దగ్గర పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మంచి వెసులుబాటును అందించింది.

పెయిడ్ సెలవులు..
చింగారీ యాప్ తన కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు నెలకు రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులను అందిస్తామని ప్రకటించింది. మహిళలు రుతుక్రమ సమయంలో వీటిని పొందుతారని యాజమాన్యం తాజాగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలకు ఈ సమయంలో ఏర్పడే ఇబ్బందుల నుంచి కొంత ఉపసమనం కల్పించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మారుతున్న దోరణి..
ప్రస్తుతం దేశంలోని చాలా కంపెనీలు తమ మహిళా ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తూ పీరియడ్ సమయంలో సెలవు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నాయి. తాజాగా చింగారీ కంపెనీ సైతం సెలవును మహిళల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని యాజమాన్యం వెల్లడించింది. 2022లో కంపెనీ తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ అనతి కాలంలోనే అనేక మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఈ కారణంగా వేల మంది మహిళలు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు.

స్పెయిన్ దేశంలో..
యూరప్ లోని స్పెయిన్‌లో ఫిబ్రవరి 16న ఒక చారిత్రాత్మక చట్టం ఆమోదించబడింది. ఈ చట్ట ప్రకారం మహిళలకు నెలసరి సమయంలో సెలవు లభిస్తుంది. స్పానిష్ పార్లమెంటులో చట్టానికి అనుకూలంగా 185 మంది ఓటు వేయటంతో ఇది కార్యరూపంలోకి వచ్చింది. రుతుస్రావం సమయంలో మహిళలకు వైద్య సెలవు అవసరమని వారు చెబుతున్నారు. దీంతోపాటు రుతుక్రమంపై ఉన్న అపోహలను తొలగించడమే తమ లక్ష్యమని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది.

కంపెనీ సీఈవో..
తాజాగా ఇండియాకు చెందిన సోషల్ యాప్ యాజమాన్యం మహిళల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సుమిత్ ఘోష్ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులకు సాధికారత కల్పించడానికి, ఆఫీసులో ఉద్యోగులందరినీ కలుపుకొని పోవడానికి తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా మహిళా ఉద్యోగుల ఆరోగ్య ప్రయోజనాల విషయంలో తాము అనుసరించిన విధానం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications