ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్.. ఈ వారం తొలిరోజే ఇన్వెస్టర్లకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చింది. భారీగా పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలిపోయాయి. షేర్లన్నీ రెడ్ జోన్‌లో కనిపించాయి. అన్ని సెక్టోరల్ షేర్లన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, రియాల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్.. ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు నష్టాల బారిన పడ్డాయి. బెంచ్‌మార్క్ ఇండైసెస్ అన్నీ మైనస్‌లల్లో పడిపోయాయి.

తీసిపోనంటోన్న రూపాయి..
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నెలకొన్న ప్రతికూల వాతావరణానికి అనుగుణంగా రూపాయి విలువ కూడా పడిపోయింది. పతనంలో ఇది కూడా కొత్త రికార్డును సృష్టించింది. ఇదివరకెప్పుడూ లేనంతంగా రూపాయి విలువ క్షీణించింది. అది అక్కడితో ఆగేలానూ కనిపించట్లేదు.

డాలర్‌తో..
అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ 78 రూపాయలను దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.78.29 పైసలకు చేరింది. కిందటి వారం ట్రేడింగ్ సెషన్‌లో గరిష్ఠస్థాయిలో రూ.77.93 పైసల వరకు నమోదైంది. ఇవ్వాళ అది మరింత పతనమైంది. 78 రూపాయల మార్క్‌ను అధిగమించింది. రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.

అమెరికన్ ద్రవ్యోల్బణమే కారణమా?
ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనివిధంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోంది. దీని ప్రభావం భారతీయ కరెన్సీపై పడిందనేది మార్కెట్ వర్గాల అంచనా. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ మార్చి నుంచి 77 నుంచి 78 రూపాయల మధ్య కొనసాగుతూ వస్తోంది. అమెరికా ఆర్థిక పరిస్థితుల్లో అప్పట్లో మెరుగ్గా ఉన్నప్పటికీ.. రూపాయి పతనం మాత్రం కొనసాగిందనే వారూ ఉన్నారు.

ఒకేసారి 36 పైసలు..
సాధారణంగా డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ క్రమంగా హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. అది 10-15 పైసల వరకు ఉంటుంది. ఇవ్వాళ మాత్రం ఒకేసారి 36 పైసల మేర క్షీణించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్‌లో రూపాయి విలువ రూ.78.20 పైసలుగా నమోదైంది.

డాలర్ సైతం..
జపాన్ కరెన్సీ యెన్‌తో పోల్చుకుని చూస్తే అటు డాలర్ విలువ కూడా 0.4 శాతం మేర పెరిగింది. 20 సంవత్సరాల తరువాత అంటే 2002 తరువాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. 135 యెన్‌కు చేరింది ఇది. 2002లో గరిష్ఠంగా 135.20 యెన్‌గా నమోదైంది. మళ్లీ 135కు చేరడం ఇదే తొలిసారి. రూపాయి విలువ 78 కంటే దిగువకు ఇప్పట్లో నమోదు కాలేకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.


Click it and Unblock the Notifications