IPO News: డబ్బు రెడీ చేసుకోండి ఇన్వెస్టర్స్.. రూ.300 కోట్ల ఐపీవో.. ఏప్రిల్ 23న ప్రారంభం..
JNK India IPO: ఏప్రిల్ నెలలో ఐపీవోల రాక భారత స్టాక్ మార్కెట్లలో కొద్దిగా పలచబడింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలతో పాటు ఇతర కారణాలతో మార్కెట్ల పతనం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఒక ఐపీవో మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమౌతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జేఎన్‌కే ఇండియా కంపెనీ ఐపీవో గురించే. మీరు ఐపీవో డబ్బులు పెట్టుబడి పెట్టి బెట్టింగ్ వేయాలనుకుంటున్నట్లయితే.. వచ్చేవారం అవకాశం అందుబాటులోకి రానుంది. జేఎన్‌కే ఇండియా లిమిటెడ్ కంపెనీ హీటింగ్ పరికరాల తయారీ వ్యాపారంలో ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో ఏప్రిల్ 23న ప్రారంభం కానుంది. ఇన్వెస్టర్లు కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు ఏప్రిల్ 25 వరకు ఇష్యూ అందుబాటులో ఉంటుంది. అయితే ఇష్యూ ఒక్కరోజు ముందు అంటే ఏప్రిల్ 22న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం తెరిచి ఉంటుంది.

ఐపీవోలో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.300 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తోంది. ఇదే సమయంలో ప్రమోటర్లకు చెందిన 84.21 లక్షల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్(OFS) రూపంలో విక్రయించబడుతున్నాయి. ఐపీవో నుంచి వచ్చే ఆదాయాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కంపెనీ పనితీరు కోసం ఉపయోగించాలని కంపెనీ నిర్ణయించింది.
చమురు శుద్ధి & పెట్రోకెమికల్ ప్లాంట్లు వంటి ప్రక్రియ పరిశ్రమల కోసం కంపెనీ హీటింగ్ పరికరాలను తయారు చేస్తుంది. కంపెనీ డిజైన్ నుంచి ఇన్‌స్టాలేషన్ వరకు ప్రతిదీ నిర్వహిస్తుంది. దేశీయ- అంతర్జాతీయ మార్కెట్‌లకు సేవలను అందిస్తోంది. భారతదేశంలో దీని ప్రధాన పోటీదారు థర్మాక్స్ లిమిటెడ్. ఇది ఫ్లేర్స్, ఇన్సినరేటర్ సిస్టమ్స్‌గా కూడా విస్తరించింది. కంపెనీ గ్రీన్ హైడ్రోజన్‌తో పునరుత్పాదక రంగంలోకి ప్రవేశిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.407.32 కోట్లుగా ఉంది. ప్రధానంగా లాభాల పెరుగుదలకు చమురు & గ్యాస్ విభాగం 77 శాతం దోహదపడింది. 2023తో ముగిసే తొమ్మిది నెలల నాటికి కంపెనీ మొత్తం అప్పు రూ.56.73 కోట్లుగా నమోదైంది.


Click it and Unblock the Notifications