రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 40 ఏళ్ల పాత రిజర్వేషన్ సిస్టమ్‌కు గుడ్‌బై.. ఇక చాలా స్మార్ట్‌గా బుకింగ్..
భారతీయ రైల్వే తన సేవలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమైంది. రాబోయే ఆగస్టు నుండి రైలు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిగా కొత్త, ఉన్నతమైన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)కు మార్చాలని నిర్ణయించింది. సుమారు 40 ఏళ్ల నాటి పాత వ్యవస్థ స్థానంలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా టిక్కెట్ బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక అవరోధాలను తొలగించి, ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశ్యమని Indian Railways తెలిపింది..
గురువారం రైల్ భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మార్పు ప్రక్రియను పర్యవేక్షించారు. పాత వ్యవస్థ నుండి కొత్త దానికి మారే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 1986లో ప్రారంభమైన భారతీయ రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ, కాలక్రమేణా అనేక మార్పులకు లోనైంది. 2002లో ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం దేశంలో దాదాపు 88 శాతం టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పెరిగిన రద్దీకి అనుగుణంగా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం అనివార్యమైంది.

ఈ ఆధునీకరణలో భాగంగా 2025లో ప్రారంభించిన 'రైల్‌వన్' (RailOne) సూపర్ యాప్ ప్రయాణికులకు వరంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించే ఈ యాప్, వెయిట్‌లిస్ట్ టిక్కెట్లు ఖరారు (Confirm) అయ్యే అవకాశాలను అద్భుతంగా అంచనా వేస్తోంది. గతంలో 53 శాతంగా ఉన్న ఈ అంచనాల కచ్చితత్వం ఇప్పుడు 94 శాతానికి పెరగడం గమనార్హం. ఇది ప్రయాణికులు తమ ప్రయాణాలను మరింత నిశ్చింతగా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతోంది.
రైల్‌వన్ యాప్ కేవలం టిక్కెట్ బుకింగ్‌కే పరిమితం కాకుండా, రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందిస్తోంది. టిక్కెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, రీఫండ్ దరఖాస్తులతో పాటు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, రిజర్వేషన్ లేని టిక్కెట్లను కూడా దీని ద్వారా పొందవచ్చు. వీటితో పాటు లైవ్ రైలు స్థితి, ప్లాట్‌ఫారమ్ నంబర్లు, కోచ్ స్థానాలు మరియు ఫిర్యాదుల కోసం రైల్ మదద్ వంటి సేవలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఈ యాప్ వినియోగం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రతిరోజూ సుమారు 9.29 లక్షల టిక్కెట్లు దీని ద్వారా బుక్ అవుతుండగా, అందులో మెజారిటీ వాటా రిజర్వేషన్ లేని టిక్కెట్లదే ఉండటం విశేషం. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్లలో కలిపి మూడున్నర కోట్లకు పైగా డౌన్‌లోడ్లతో ఈ యాప్ అత్యంత ఆదరణ పొందుతోంది. ఈ కొత్త రిజర్వేషన్ వ్యవస్థ అమల్లోకి వస్తే, భారతీయ రైల్వే ప్రయాణం మరింత సులభతరం, సాంకేతికంగా పటిష్టం కానుంది.


Click it and Unblock the Notifications
