తత్కాల్ టికెట్ బుకింగ్‌లో సరికొత్త రూల్.. ఇకపై లైన్లలో గంటల కొద్దీ నిలబడాల్సిన పనిలేదు!
మన దేశంలో ఎమర్జెన్సీగా ఎక్కడికైనా వెళ్లాలంటే గుర్తోచ్చే మొదటి ఆప్షన్ తత్కాల్ (tatkal) టికెట్ బుకింగ్. కానీ, ఈ టికెట్ దొరకడం అనేది ఒక యుద్ధం లాంటిదే. రైల్వే స్టేషన్ కౌంటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల మేర లైన్లు కట్టడం, నెట్టుకోవడాలు, చివరి నిమిషంలో టికెట్ దొరకక నిరాశతో ఇంటికి తిరిగి రావడం మనకు తెలిసిందే. ప్రయాణికుల పడుతున్న ఈ ఇబ్బందులను గమనించిన ఇండియన్ రైల్వేస్.. కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి, అందరికీ సమానంగా టికెట్లు దొరికేలా చేయడానికి ఒక అద్భుతమైన 'టోకెన్ సిస్టమ్'ను ప్రారంభించింది. పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని కోటా డివిజన్‌లో ఈ సరికొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

కొత్త టోకెన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త రూల్ ప్రకారం.. తత్కాల్ (tatkal) టికెట్ కోసం కౌంటర్లకు వచ్చే ప్రయాణికులకు మొదట ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ ఆధారంగానే వారిని బుకింగ్ కోసం వరుస క్రమంలో పిలుస్తారు. దీనివల్ల కౌంటర్ల వద్ద తోపులాటలు, గందరగోళం పూర్తిగా తగ్గిపోతాయి.
కోటా డివిజన్ గైడ్‌లైన్స్ ప్రకారం.. ఏసీ (AC) క్లాస్ తత్కాల్ టికెట్లు కావాలనుకునే వారు ఉదయం 9:00 గంటల నుండి 9:25 గంటల లోపు కౌంటర్ వద్ద టోకెన్ తీసుకోవాలి. అలాగే, స్లీపర్ క్లాస్ టికెట్ల కోసం చూస్తున్న వారు ఉదయం 9:30 గంటల నుండి 9:55 గంటల లోపు టోకెన్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టోకెన్లు తీసుకున్న తర్వాత, బుకింగ్స్ స్టార్ట్ కాగానే మీ నెంబర్ ప్రకారం టికెట్ ఇస్తారు.
అసలు టైమింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు!
ఇక్కడ ప్రయాణికులు గమనించాల్సిన విషయం ఏంటంటే.. తత్కాల్ (tatkal) టికెట్లు బుక్ అయ్యే అసలు టైమింగ్స్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఎప్పటిలాగే ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం 10:00 గంటలకు, నాన్-ఏసీ (స్లీపర్) క్లాస్ బుకింగ్స్ ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతాయి. జర్నీ డేట్‌కు ఒకరోజు ముందే ఈ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.
నిజానికి ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ (IRCTC) యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసేటప్పుడు ఎదురయ్యే సర్వర్ సమస్యలు, ఏజెంట్ల దందా వల్ల చాలా మంది సాధారణ జనం కౌంటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి వారికి ఈ ఆఫ్‌లైన్ టోకెన్ సిస్టమ్ ఒక పెద్ద వరం లాంటిదని చెప్పాలి.
మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే..
కేవలం ఆఫ్‌లైన్ లోనే కాదు, ఆన్‌లైన్ తత్కాల్ (tatkal) బుకింగ్స్‌లో కూడా ఫేక్ అకౌంట్లను, బాట్‌లను (Bots) అరికట్టడానికి రైల్వే శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటోంది. జూలై 2025 నుండి ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ తత్కాల్ బుకింగ్స్ కోసం ఐడెంటిటీ వెరిఫికేషన్ , ఓటీపీ (OTP) విధానాన్ని తప్పనిసరి చేశారు. దీనివల్ల సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి టికెట్లు కొల్లగొట్టే ఏజెంట్లకు గట్టి బ్రేక్ పడింది.
కోటా డివిజన్‌లో ప్రవేశపెట్టిన ఈ టోకెన్ సిస్టమ్ గనుక సక్సెస్ అయితే.. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో కూడా దీనిని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో జెన్యూన్ ప్రయాణికులకు కన్ఫర్మ్డ్ టికెట్లు దక్కేలా చేయడమే రైల్వే శాఖ యొక్క అసలు లక్ష్యం.


Click it and Unblock the Notifications