ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇప్పుడు తన ఆపరేషన్స్ బాధ్యతల్ని ఒక భారతీయ మూలాలున్న నాయకుడి చేతుల్లోకి అప్పగించింది. సబిహ్ ఖాన్ కొత్త COO (Chief Operating Officer)గా నియమించింది. ఇది కేవలం ఒక ఉద్యోగ నియామకమే కాదు. ఆపిల్ లో ఓ భారతీయుడు మరింత బలంగా కనిపించడానికి ఇది ఒక బీజం కూడా.

ఇది కంపెనీ ఎంతో కాలంగా ప్రణాళిక వేసుకుంటూ వచ్చిన నాయకత్వ మార్పు భాగంగా జరిగింది. సబిహ్ ఖాన్ గత 30 ఏళ్లుగా ఆపిల్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆపరేషన్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈ నెల చివర్లో ఆయన కొత్తగా COO (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపడతారు. ఈయన 1995లో ఆపిల్ ప్రొక్యూర్మెంట్ గ్రూప్‌లో చేరే ముందు, సబిహ్ ఖాన్ GE ప్లాస్టిక్స్‌లో అప్లికేషన్స్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ మరియు కీలక ఖాతాల సాంకేతిక నాయకుడిగా పనిచేశారు.
సబిహ్ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్‌లో జన్మించారు. చిన్నప్పుడే కుటుంబంతో సింగపూర్‌కు వెళ్లి, తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డ్యూయల్ బ్యాచిలర్ డిగ్రీలు, RPI నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.
టిమ్ కుక్ ఆయనను "బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్"గా, ఆపిల్ సరఫరా వ్యవస్థకు కేంద్ర శిల్పిగా ప్రశంసించారు. అధునాతన తయారీ విధానాలు, అమెరికాలో ఉత్పత్తి విస్తరణ, పర్యావరణ స్థిరత్వం (కార్బన్ ఉద్గారాలను 60% తగ్గించడం) వంటి రంగాల్లో ఆయన నాయకత్వాన్ని కొనియాడారు.
ప్రస్తుత COOగా జెఫ్ విలియమ్స్ ఈ సంవత్సరం చివర వరకు ఆపిల్‌లో కొనసాగుతారు. ఆయన CEO టిమ్ కుక్‌కు నివేదిక ఇస్తూ, కంపెనీ డిజైన్ టీమ్ మరియు ఆపిల్ వాచ్ పర్యవేక్షణ కొనసాగిస్తారు. విలియమ్స్ రిటైర్ అయిన తర్వాత, డిజైన్ టీమ్ నేరుగా టిమ్ కుక్‌కు నివేదిక ఇస్తుంది.
ఈ రోజు సబిహ్ ఖాన్ కు అప్పగించిన COO పదవి టిమ్ కుక్ నాయకత్వం కింద కంపెనీ యొక్క ప్రధాన వ్యూహాల అమలులో కీలక బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తి సామర్థ్యం, గ్రీన్ టెక్నాలజీ వైపు దృష్టి, భారతదేశంలో ఉత్పత్తి విస్తరణ. ఇవన్నీ ఇప్పుడు ఖాన్ పర్యవేక్షించాల్సిన అంశాలు.
ఇప్పుడు ఆయన బాధ్యతల్లో కంపెనీ మొత్తం కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ, ఉత్పత్తుల నాణ్యత, సరఫరాదారుల నిర్వహణ వంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఈ పదవి చాలా కీలకం, ఎందుకంటే గతంలో టిమ్ కుక్ కూడా COOగా పనిచేశాకే CEOగా నియమితులయ్యారు. ఆపిల్‌లో COOగా ఉన్నవారికి CEO స్థానానికి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సబిహ్ ఖాన్‌కి నాయకత్వ లక్షణాలు ఉండటం వల్ల గతంలో ఆపిల్ విడుదల చేసిన ప్రతి కీలక ఉత్పత్తి వెనక కూడా ఆయన శ్రమ ఉంది. గ్లోబల్ సప్లై చైన్‌ను సమర్థంగా నిర్వహించడంలో, సంస్థపై విశ్వసనీయతను నిలబెట్టడంలో ఆయన చూపిన నైపుణ్యం అత్యంత గొప్పది. ఆయనకు ఉన్న అంతర్జాతీయ అనుభవం కూడా విశేషంగా ఉపయోగపడుతోంది. ఈ లక్షణాలు నేటి గ్లోబల్ కంపెనీలకు చాలా అవసరం. అందుకే, భవిష్యత్తులో CEO పదవికి కూడా ఆయన అర్హుడే అని భావిస్తున్నారు.
ఇదంతా చూస్తే, ఒక భారతీయుడు ప్రపంచ అత్యుత్తమ బ్రాండ్ అయిన ఆపిల్ లో ఇంత కీలక స్థానాన్ని అధిరోహించడం మనందరికీ గర్వకారణం. ఆపిల్ కొత్త దిశగా పయనిస్తున్న సమయంలో, సబిహ్ ఖాన్ లాంటి వ్యక్తి నాయకత్వంలో కంపెనీ మరింత స్థిరంగా, సమర్థంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications