అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలను మనం ఎలాగూ కంట్రోల్ చేయలేం. కనీసం మనకు పనికిరాని వాటిని ఉపయోగించి తక్కువ ధరకే పెట్రోల్ పొందితే ఎలా ఉంటుంది ? ఏంటి ఈ చెత్త వాగుడు, ఇదేమైనా ఎక్స్ఛేజ్ ప్రోగ్రామా అనుకుంటున్నారా..? అవును ఇది నిజంగానే చెత్త ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం. దీని పూర్తి వివరాలేంటో చూద్దాం..
ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'రీఫ్యూయల్ విత్ రీసైకల్' పేరిట Recykal తో కలిసి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. హైదరాబాద్ వాసులు తమ ఇంట్లోని వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చేతులు కలపాలని ప్రోత్సహిస్తోంది.

ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులలో QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ కావచ్చు. ఆయా వ్యక్తులు తమ చెత్తను అక్కడ తూకం వేసి బరువుకు తగినన్ని క్రెడిట్ పాయింట్లు సంపాదించవచ్చు. ఇంధనం నింపుకునే సమయంలో ఈ పాయింట్లను రిడీమ్ చేసుకుని పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవచ్చు.
ఆగస్టు 2023 వరకు పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఎంపిక చేసిన హైటెక్ సిటీ COCO, TSIIC నాలెడ్జ్ సిటీ, జూబ్లీ హిల్స్ రోడ్ నం 36 COCO, మియాపూర్ సైబర్ ఫిల్లింగ్ స్టేషన్, బేగంపేట COCO పెట్రోల్ బంకులలో మాత్రమే ఇందుకు అవకాశం కల్పించారు. మొదటగా ఈ 5 చోట్ల స్టార్ట్ చేసినా వినియోగదారుల స్పందన ఆధారంగా భవిష్యత్తులో 34 వేల బంకులనూ కవర్ చేసేలా ప్లాన్ చేశారు.
ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలు, పేపర్, కార్డ్ బోర్డ్, మొబైల్స్, ల్యాప్ టాప్‌లు, నెట్ వర్క్ పరికరాలు, కేబుల్స్ సహా ఇతర పనికిరాని వస్తువులను పై 5 ఇండియన్ ఆయిల్ బంకుల్లో ఇవ్వవచ్చు. 10 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను అందించిన వారికి కొంత అదనపు బెనిఫిట్ ఉంటుంది. ఉచిత ఇంధనాన్ని ఆస్వాదిస్తూనే, వ్యర్థాలను బాధ్యతాయుతంగా రీసైకిల్ చేసే అవకాశం లభిస్తుంది. తద్వారా పరిశుభ్రమైన సమాజ స్థాపనకు సహకరించినట్లవుతుంది.


Click it and Unblock the Notifications