LPG Price: ప్రతి నెల మెుదటి తారీఖున దేశంలోని చమురు కంపెనీలు తమ గ్యాస్ ధరలను మారుస్తుంటాయి. ఈ క్రమంలో నేడు వినియోగదారులపై కంపెనీలు ధరల బాంబును విసిరాయి.
నవంబర్ నెలలో దీపావళికి ముందరే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. అయితే పెరిగిన కొత్త ధరలు నవంబర్ 1, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.103 పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి.

దేశంలోని వివిధ నగరాల్లో మారిన కమర్షియల్ సిలిండర్ ధరలను పరిశీలిస్తే.. రాజధాని ఢిల్లీలో రూ.1,833గా ఉండగా.. గతంలో ఇది రూ.1,731గా ఉంది. అలాగే ముంబైలో ధర రూ.1,684 నుంచి రూ.1,785.50కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1,839.50కి బదులుగా రూ.1,943కి, చెన్నైలో దీని ధర రూ.1,999.50 రేటుకు చేరుకున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో తాజా ధరను పరిశీలిస్తే రూ.2,053.50 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల రేట్లను చమురు కంపెనీలు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి దేశంలో అనేక రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడిన వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత నెలలో వీటి ధరలను భారీగా తగ్గించాయి. అయితే ఎన్నికల తర్వాత మళ్లీ రేట్లను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజలకు కొంత ఊరట దొరకినట్లేనని చెప్పుకోవచ్చు.
గతంలో రక్షాబంధన్ పండుగకు ముందు ఆగస్టు నెలలో గృహ వినియోగదారులకు గ్యాస్ ధరలను సిలిండరుకు రూ.200 తగ్గించి ప్రభుత్వం పెద్ద కానుకగా ఇచ్చింది. ఇదే క్రమంలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు సబ్సిడీని రూ.200 నుంచి రూ.400కు పెంచింది. ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50క, హైదరాబాదులో రూ.955 రేటుకు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications