Mutual Funds: మిసైల్‌లా దూసుకెళ్తున్న మ్యూచువల్ ఫండ్స్.. ఎగబడి కొంటున్న జనాలు
Equity Funds: ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పట్ల జనాల్లో అవగాహన పెరుగుతూ వస్తోంది. అందుకే మధ్యతరగతి ప్రజలు పొదుపుపై దృష్టిపెడుతున్నారు. తక్కువ మొత్తంతో భారీ కార్పస్ సృష్టించుకునే అవకాశం ఉన్న మ్యూచువల్ ఫండ్ల పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులోని కాంపౌండింగ్ సౌలభ్యం మదుపరులను అమితంగా ఆకర్షిస్తోంది.
దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నెట్ ఇన్‌ఫ్లో నవంబర్, 2022లో 13 వేల 264 కోట్లుగా ఉంది. అదికాస్తా ఈఏడాది నవంబర్ నాటికి 93 శాతం పెరిగి 25 వేల 616 కోట్లకు చేరుకున్నట్లు ICRA అనలిటిక్స్ నివేదిక తెలిపింది. ఇందులో డెట్ ఫండ్స్ నికర అవుట్‌ఫ్లో పెరగ్గా.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఓపెన్ ఎండ్) కేటగిరీలో నికర ఇన్‌ఫ్లో 588 శాతం వృద్ధిని సాధించింది.

మొత్తం ఇండియన్ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణ(AUM) కింద ఉన్న నికర ఆస్తులు నవంబర్ 30, 2022 నాటికి 40.38 లక్షల కోట్లు. నవంబర్ 30, 2023 నాటికి అది 49.05 లక్షల కోట్లకు చేరి 21 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక ఈక్విటీ-ఆధారిత పథకాల్లోకి నికర ఇన్‌ఫ్లోలు నవంబర్‌లో దాదాపు 588 శాతం పెరిగి 15 వేల 536 కోట్లను టచ్ చేశాయి. గతేడాది ఇదే కాలంలో ఈ విలువ కేవలం 2 వేల 258 కోట్లే కావడం గమనార్హం.
అన్ని ఈక్విటీ కేటగిరీలు మంచి నికర ఇన్‌ఫ్లోలను నమోదు చేసినప్పటికీ.. మిడ్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్‌లు స్పష్టంగా ఔట్ పెర్ఫార్మర్స్ అని ICRA అనలిటిక్స్ మార్కెట్ డేటా హెడ్ అశ్విని కుమార్ తెలిపారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. రాజకీయ సుస్థిరత, బలమైన దేశీయ వృద్ధి అంచనాల వల్ల సానుకూల సెంటిమెంట్ బిల్డ్ అవుతున్నట్లు వెల్లడించారు. క్రూడ్ ఆయిల్ ధరల పతనం, US ట్రెజరీ దిగుబడి తగ్గుదల ఇందుకు తోడ్పడినట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications