Tech Jobs: ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం అదుపులోకి రావటం మంచి కాలాన్ని సూచిస్తోంది. ప్రధానంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లతో పాటు కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న టెక్కీలకు మంచి సమయం సమీపంలోనే ఉందని నిపుణులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. దేశంలోని మధ్యతరహా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెంచుకోవటం దీనినే సూచిస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలోని కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో డీల్స్ లేకపోవటం, వ్యాపార మందగమనంతో చాలా కంపెనీలు గతంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించి ఖర్చుల మదింపులకు దిగిన సంగతి తెలిసిందే. వ్యాపార అనిశ్చితుల సమయంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం, వారికి ప్రమోషన్లు, జీతాల పెంపుదల ఇవ్వకపోవడం వంటి చర్యలకు ఉపక్రమించాయి.

ముఖ్యంగా భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ఇటీవల తమ కంపెనీల్లో నియామకాలను తగ్గించాయి. ఇప్పటికే ఆఫర్ లెటర్లు అందించిన ప్రెషర్లను ఆన్ బోర్డింగ్ ఆలస్యంగా కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా మరోపక్క దీనికి విరుద్ధంగా మిడ్-సైజ్ ఐటీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు వెల్లడైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కోఫోర్జ్ 1,500 మంది ఉద్యోగులను తీసుకోవటంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 24,726కి చేరుకుంది. అలాగే కేపీఐటీ 1843 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. ఇక సైయంట్ అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ 250 మందికి పైగా కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి.
ప్రధానంగా చిన్న తరహా కంపెనీలు స్వల్పకాలిక ప్రాజెక్టులను ఎంచుకుని వాటిని విజయవంతంగా పూర్తి చేయడం, స్థానిక స్థాయి ఖాతాదారులను ఆకర్షించడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు పెద్ద టెక్ కంపెనీల వైపు చూడకుండా మిడ్ క్యాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇటువంటి చిన్న సంస్థలను కస్టమర్లు మరింత అనువైనదిగా భావిస్తారని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. మొత్తంమీద టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఉద్యోగుల సంఖ్యను 64,000 తగ్గించాయి.


Click it and Unblock the Notifications