Share Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఏడాది అంతా బుల్ రన్ కొనసాగించాయి. ఇంకో వారంలో 2023 ముగియనుండగా.. కొత్త టార్గెట్లను చేధించే దిశగా మరోసారి నిఫ్టీ, సెన్సెక్స్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ లు రంకెలు వేస్తూ ముందుకు సాగుతున్నాయి.
సెన్సెక్స్ 71 వేల మార్కును దాటుతుండగా.. నిఫ్టీ 21 వేల 500 పైన ఈ ఏడాదిని ఉత్సాహంగా ముగించడానికి సిద్ధమవుతోంది. నవంబర్, డిసెంబర్‌లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లు దేశీయ మార్కెట్లకు మంచి బూస్ట్ ఇచ్చాయి. తద్వారా ప్రపంచ విపణిలో మన మార్కెట్లు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ బ్రోకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నివేదిక పేర్కొంది.

ఇక సెకండరీ మార్కెట్‌లో IPOలు కూడా మార్కెట్ బుల్లిష్ ట్రెండ్‌కు తగినట్లుగా మద్ధతిచ్చాయి. 58 సంస్థలు మార్కెట్లలో లిస్ట్ కావడానికి క్యూ కట్టాయి. గతేడాది 40 IPOలు 64 వేల కోట్లు సమీకరించగా.. ఈ దఫా 48 వేల కోట్లు రాబట్టగలిగాయి. ఓలా ఎలక్ట్రిక్, స్విగ్గీ, ఫస్ట్‌క్రై, మొబిక్విక్ సహా పలు టెక్ కంపెనీలు గణనీయమైన మెరుగుదల కనబరిచాయి.
భారత స్థూల మరియు సూక్ష్మ ఆర్థిక మూలాలు బలంగా ఉండటంతో.. మార్కెట్లు కొత్త గరిష్టాలను నమోదు చేయడంలో తమ వంతు పాత్ర పోషించాయి. 2023లో నిఫ్టీ ఇప్పటివరకు 18 శాతం రాబడిని ఇచ్చింది. మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్‌ల జోరుకి హద్దు లేకుండా పోయింది. 44 శాతం రిటర్న్స్ తో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 మతిపోగొట్టగా.. 54 శాతం సంపద సృష్టించి నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇతర సూచీలకు గట్టి పోటీ ఇచ్చింది.
PSUలు, రియల్టీ, ఆటో, పవర్, డిఫెన్స్, షిప్పింగ్, ఫెర్టిలైజర్ వంటి అనేక రంగాల్లో భారీ కొనుగోళ్లకు ముదుపర్లు ఆసక్తి కనబరిచారని మోతీలాల్ రిపోర్ట్ వెల్లడించింది. అంతర్జాతీయ ఒత్తిళ్లను దేశీయ బ్యాంకింగ్ రంగం చాలా తేలికగా ఎదుర్కోగలిగింది. ఇవన్నీ వెరసి భారత్ రేటింగ్ అప్‌గ్రేడ్ కావడంలో కీలకంగా నిలిచాయి. ఫలితంగా BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. హాంకాంగ్ ఎక్స్ఛేంజ్‌ను అధిగమించిన NSE.. మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఎక్స్ఛేంజ్ గా అవతరించింది.


Click it and Unblock the Notifications