Sensex Crash: వరుసగా 3వ రోజు నష్టాల్లో మార్కెట్లు.. క్షీణతకు కారణాలివే..
Market Fall: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిదారులు ఆందోళనలో ఉన్నారు. వరుసగా మూడు సెషన్లలో మార్కెట్ల క్షీణతతో ఇన్వెస్టర్లు భారీగా సంపదను కోల్పోయారు. ఈరోజు మార్కెట్ల పతనంలో రూ.లక్ష కోట్ల మేర కోల్పోయారు.
ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో వడ్డీ రేట్ల తగ్గింపును అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ మరికొంత కాలం వాయిదా వేస్తుందనే ఆందోళనలు మార్కెట్లను ఒడిదొడుకుల్లో ఉంచగా.. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతనానికి ఆజ్యం పోశాయి. ఈ ప్రభావం నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా షేర్లలో నేడు భారీగా కనిపించింది. ఈ సూచీలు 1-2 శాతం మధ్య క్షీణతను చూస్తున్నాయి. యుద్ధ భయాలు అలుముకోవటంతో ఆసియా సహా అన్ని ప్రధాన మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ఈ క్రమంలో ఆసియా మార్కెట్లను వరుసగా పరిశీలిస్తే.. మధ్యప్రాచ్యంలో పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా జపాన్‌కు చెందిన నిక్కీ 225 1.5% క్షీణించగా, టాపిక్స్ 1.04% పడిపోయింది. దక్షిణ కొరియా కోస్పి 1.31%, కోస్‌డాక్ 0.86% పడిపోయాయి. హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ బలహీనమైన ప్రారంభాన్ని నమోదు చేశాయి. అలాగే సోమవారం అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడింగ్ ముంగించాయి. వాల్ స్ట్రీట్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 248.13 పాయింట్లు, S&P 500 61.59 పాయింట్లు పతనమయ్యాయి. నాస్‌డాక్ కాంపోజిట్ 290.07 పాయింట్లు కోల్పోయింది.
స్టాక్ మార్కెట్ల పతనంతో చాలా మంది తమ డబ్బు ఈక్విటీ నుంచి డెట్ వైపుకు మళ్లిస్తున్నారు. పెద్ద ఇన్వెస్టర్లు ఎక్కువగా గోల్డ్, సిల్వర్ కొనుగోళ్లకు మెుగ్గుచూపుటంతో అవి తమ జీవితకాల గరిష్ఠాలకు చేరుకుని సామాన్య వినియోగదారులకు అందని ద్రాక్షగా మారుతున్నాయి. ప్రస్తుత స్థాయి ధరలను చూసి ప్రధానంగా పసిడి ప్రియులైన భారతీయులు ఆందోళన చెందుతున్నారు. బంగారం రూ.75,000 మార్కుకు చేరుకోగా.. వెండి రూ.లక్షకు చేరువయ్యేందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications