Sensex Rally: బడ్జెట్ ముందు మార్కెట్ల ర్యాలీ.. 1100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. ఎందుకంటే?
Stock Market: గతవారం తీవ్ర ఒడిదొడుకులను అధిగమించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఊహించని రీతిలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో లాంఛనంగా ముందుకు కొనసాగుతోంది.
మధ్యార్నం 1.43 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1123 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో దూసుకుపోతోంది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 343 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 556 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 572 పాయింట్ల మేర పెరుగుదలను నమోదు చేశాయి. ఈ మెగా ర్యాలీకి అసలు కారణాలను తెలుసుకోవాలని చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు కుతూహలంగా ఉన్నారు.

వాస్తవానికి మరో రెండు రోజుల్లో జనవరి మాసం ముగియటంతో పాటు ఫిబ్రవరి 1న కొత్త మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ సిద్ధంగా ఉంది. బడ్జెట్ ముందు మార్కెట్లు బుల్ జోరును ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఈ వారం మార్కెట్లు బడ్జెట్ ప్రకటనతో పాటుగా యూఎస్ సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ సమావేశం ఉన్నందున ఓలటాలిటీ కొనసాగుతుందని చాలా మంది మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు. వీటికి తోడు ఆసియా మార్కెట్లతో పాటు, అమెరికా మార్కెట్లంతటా సానుకూల సంకేతాలు కొనసాగటం ఊరటను కలిగిస్తోంది. యూఎస్ క్యూ4 ఆర్థిక గణాంకాలు ఊహకు మించిన పనితీరును కనబరచటం కలిసొచ్చే అంశంగా ఉంది.
ఇక మార్కెట్ల ర్యాలీకి దోహదపడుతున్న మరో అంశం క్యూ3 కార్పొరేట్ ఫలితాలు. బ్యాంకింగ్ నుంచి ఐటీ, తయారీ, ఎఫ్ఎమ్సీజీ రంగాల్లోని పలు ప్రముఖ కంపెనీలు ఇప్పటికే తమ ఫలితాలను ప్రకటించాయి. మరిన్ని కంపెనీలు ప్రకటిస్తున్న గణాంకాలు ఆర్థిక అస్థిరతల్లోనూ సానుకూలంగా ఉండటం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లు విదేశీ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారటం కూడా ర్యాలీలో భాగమైందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications