Wedding Business: దేశంలో వరుస పండుగలు మెగా షాపింగ్ స్పీని స్టార్ట్ చేశాయి. ఇప్పటికే దసరా, ధనత్రయోదశి, కర్వా చౌత్, దీపావళి వంటి వరుస పండగలతో అక్టోబర్ నెల ముగిసింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో లక్షల కోట్ల వ్యాపార టర్నోవర్ సృష్టించింది. అయితే నవంబర్ మాసంలో దీనిని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు నవంబర్ పెళ్లిళ్ల హడావిడితో సిద్ధం అవుతోంది.
భారతదేశంలో పెళ్లిళ్లకు శుభగడియలను చూసి ముహూర్తాలు పెడుతారు. ఈ క్రమంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి 2025 వరకు వరుసగా ఉన్న శుభముహూర్తాలతో దీపావళి తర్వాత పెళ్లిళ్ల సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనాల ప్రకారం ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 48 లక్షల వివాహాలు జరగబోతున్నాయ్. ఇది దేశవ్యాప్తంగా రూ.6 లక్షల కోట్ల వ్యాపారానికి ఆజ్యం పోస్తుందని అంచనా వేయబడింది. అయితే ఈ పెళ్లిళ్లలో దాదాపు 10 శాతం వరకు దేశ రాజధాని దిల్లీలో జరగనున్నాయని తెలుస్తోంది. ఇది కేవలం దిల్లీ ఆర్థిక వ్యవస్థలో రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారానికి దారితీస్తుందని అంచనా వేయబడింది.

ఈనెల రెండవ వారం నుంచి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్ కోసం దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు. నగల వ్యాపారులు, వస్త్ర దుకాణాలు, క్యాటరింగ్, ఆటోమొబైల్, ఈవెంట్ మేనేజర్లతో సహా అనేక ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు దీని నుంచి బిజినెస్ పొందనున్నారు. ప్రస్తుతం దేశంలో ల్యావిష్ వెడ్డింగ్ కల్చర్, డెస్టినేషన్ వెడ్డింగ్, ప్రీవెడ్డింగ్ షూట్స్ అంటూ రకరకాల పద్ధలు రావటంతో పెళ్లికి అవుతున్న ఖర్చు సైతం భారీగానే ఉంటోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధ్యయనం ప్రకారం, వస్తువులు, సేవలు రెండింటినీ కలిగి ఉన్న రిటైల్ రంగం ఈ పండుగ సీజన్‌లో మొత్తం రూ.5.9 లక్షల కోట్ల టర్నోవర్‌ను సాధించగలదని అంచనా. దీనికి అనుగుణంగా కేవలం ఈ-కామర్స్ రంగం టర్నోవర్ రూ.1.1 లక్షల కోట్లుగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది.
శుభకార్యం ఏదైనా ఇండియాలో ఖచ్చితంగా ఉండాల్సింది గోల్డ్ అండ్ సిల్వర్. ఎందుకంటే బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులకు ఈ సమయంలో భారీగా డిమాండ్ ఉంటుంది. ఇటీవలి కాలంలో వెండి, బంగారం ధరలు ఆకాశాన్ని అంటినప్పటికీ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లలో వీటికి అగ్రస్థానం కొనసాగుతూనే ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ జ్యువెలరీ రిటైల్ సంస్థలు తరుగుపై తగ్గింపు, బిల్లింగ్ డిస్కౌంట్స్, ఉచిత బంగారం వెండి కాయిన్స్ అంటూ అనేక ఆకర్షనీయమైన ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ధరలు అధికంగా ఉండటంతో మరికొందరు మాత్రం వీటికి ప్రత్యామ్నాయంగా.. స్థిరాస్తి, వాహనాలు, క్యాష్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి ఇతర గిఫ్ట్స్ కొత్త జంటలకు బహుకరిస్తున్నారు.


Click it and Unblock the Notifications