భారత ఐటీ స్టాక్స్ ఊహించని విజయం: అమెరికాకు ఎందుకంత భయం?
అమెరికా టెక్ స్టాక్స్ తడబడుతున్నా, ట్రంప్ కొత్త పన్నులు, వడ్డీ రేట్ల పెంపు.. ఇలా ఎన్ని సమస్యలున్నా మన ఐటీ షేర్లు మాత్రం దూసుకెళ్తున్నాయి. అసలు కారణం ఏంటి?
ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో టీసీఎస్ షేర్లు రూ. 2,523.60 వద్ద ప్రారంభమై రూ. 2,640 వరకు పెరిగాయి. అంటే దాదాపు 5% లాభపడ్డాయి. అదేవిధంగా, ఇన్ఫోసిస్ రూ. 1,151 నుంచి రూ. 1,185కి చేరింది. ఒక్కరోజే 4.69% కంటే ఎక్కువ లాభాన్ని నమోదు చేసింది. హెచ్‌సీఎల్ 6.28%, టెక్ మహీంద్రా 3.33%, విప్రో సుమారు 4% చొప్పున లాభపడ్డాయి.
అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. దీంతో ఫెడరల్ రిజర్వ్ బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను పెంచడం ఖాయమని తేలిపోయింది.
ఈ వడ్డీ రేట్ల పెంపు వల్ల, భారీ అప్పులతో నడుస్తున్న ఏఐ (AI) కంపెనీలు ఇప్పుడు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల అవి ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటాయని అంచనాలు వెలువడుతున్నాయి.

ఈ ప్రభావంతో, ఇన్వెస్టర్లు గ్లోబల్ ఏఐ స్టాక్స్‌ను 'వచ్చిన లాభం చాలు' అనుకుని అమ్మేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ వల్ల పెద్దగా ప్రభావం పడని భారత ఐటీ కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే, మన ఐటీ కంపెనీలకు అప్పులు తక్కువ, చేతిలో నగదు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి.
ఏఐ రంగంలో నెలకొన్న ఈ అనిశ్చితి కారణంగా, నవంబర్ నెలలోనే విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్స్‌లో సుమారు రూ. 1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు.
ఇదిలా ఉండగా, భారత వస్తువులపై 25% వరకు పన్ను విధించాలని అమెరికా వాణిజ్య శాఖ అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే, ఈ పన్ను 17%కి తగ్గే అవకాశం ఉంది.
ఇదే సమయంలో, ఏఐ టెక్నాలజీ సేవల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు భారత ఐటీ సంస్థలను సంప్రదిస్తున్నాయి. అంతేకాదు, చాలా కంపెనీలు తమ టెక్ బృందాలను పూర్తిగా మన ఐటీ కంపెనీలకు అప్పగించి, టెక్నాలజీ బాధ్యతలన్నీ అప్పజెప్పడానికి సిద్ధమవుతున్నాయి.
దీంతో భారత ఐటీ సేవల రంగానికి కొత్త వ్యాపార అవకాశాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఏఐ రంగంతో సమానమైన వృద్ధి కాకపోయినా, కొత్త టెక్నాలజీలో వ్యాపారం దక్కించుకోవడం ఐటీ రంగానికి పెద్ద బలంగా మారింది.


Click it and Unblock the Notifications