Infosys News: టెక్కీలకు కళ్లుచెదిరే కానుకిచ్చిన ఇన్ఫోసిస్.. రెండు స్కీమ్స్ కింద షేర్స్..
Infosys Shares: దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటి ఇన్ఫోసిస్. కంపెనీ అనిశ్చిత వ్యాపార వాతావరణంలో సైతం మంచి ఆర్థిక పనితీరును చూపిస్తోంది. కంపెనీ ఇటీవల ప్రకటించిన క్యూ4 ఫలితాలు సైతం కంపెనీ బలమైన పనితీరుకు అద్దం పడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఐటీ దిగ్గజ కంపెనీ అర్హులైన ఉద్యోగులకు కంపెనీకి సంబంధించిన 6.57 లక్షల ఈక్విటీ షేర్లను బహుమతిగా అందించింది. ఈ వార్త ప్రస్తుతం టెక్ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే మే 1న రెజల్యూషన్ ద్వారా కంపెనీ దీనికి ఆమోదం తెలిపింది. కంపెనీ వీటిని రెండు స్టాక్ ఇన్సెంటివ్ పథకాల కిందట ఉద్యోగులకు అందిస్తున్నట్లు తాజా స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. కంపెనీలో ఉద్యోగుల యాజమాన్యాన్ని పెంచటంతో పాటు వారి పనితీరుకు ప్రతిఫలంగా షేర్లను ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది.

ఉద్యోగులకు కేటాయించిన మొత్తం షేర్లలో 3,41,402 ఈక్విటీ షేర్లను 2015 ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ కింద ఇస్తుండగా.. మిగిలిన 3,15,926 షేర్లను కంపెనీ ఇన్ఫోసిస్ ఎక్స్‌పాండెడ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్ 2019 కింద కేటాయించింది. సుమారు రూ.5.85 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన దేశంలో రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థగా ఇన్ఫోసిస్ ప్రస్తుతం కొనసాగుతోంది. తాజా షేర్ కేటాయింపుల తర్వాత మే 2, 2024 నాటికి ఇన్ఫోసిస్ జారీ చేయబడిన, సబ్‌స్క్రయిబ్ చేయబడిన షేర్ క్యాపిటల్ రూ.20,75,76,23,960కి పెరిగింది.
ఇక కంపెనీ ఇటీవల ప్రకటిన ఆర్థిక ఫలితాలను గమనిస్తే.. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.7,975 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఈ క్రమంలో ఆదాయం రూ.37,923 కోట్లుగా నమోదైంది. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను పరిశీలిస్తే.. FY25లో స్థిరమైన కరెన్సీ పరంగా 1-3 శాతం ఆదాయ వృద్ధిని అంచనా వేయగా.. 20-22 శాతం నిర్వహణ మార్జిన్‌ను అంచనా వేసింది.


Click it and Unblock the Notifications