Lay Off: మన దేశంలోనూ ఐటీ ఉద్యోగులకు కష్టాలు మెుదలయ్యాయి. ఇప్పటి వరకు విదేశీ టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న వార్తలు మనం విన్నాం. భారత టెక్కీలు సేఫ్ అని అందరూ అనుకున్నారు. కానీ.. దేశంలో మూడవ అతిపెద్ద ఐటీ సంస్థ ఒకేసారి 350 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్..
అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుగా దేశంలో మూడవ స్థానంలో ఉన్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టుపై పనిచేస్తున్న 350 మంది ఉద్యోగులను ప్రపంచవ్యాప్తంగా తొలగించింది. ప్రస్తుతం ఈ వార్త ఐటీ ఉద్యోగుల్లో గుబులు పుట్టిస్తోంది. కఠినమైన వ్యాపార వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదంటూ సంస్థ ఉద్యోగులకు తెలిపింది.

సెప్టెంబరు 30న..
భారత్ తో పాటు గ్వాటెమాల, ఫిలిప్పీన్స్ లో ఉన్న ఉద్యోగులకు సెప్టెంబరు 30న పనికి చివరి రోజు అని కంపెనీ తెలిపింది. మైక్రోసాఫ్ట్ పని నాణ్యతతో సమస్యల కారణంగా ఇది జరిగినట్లు వెళ్లిపోతున్న ఒక ఉద్యోగి తెలిపారు. ఉద్యోగులకు సెప్టెంబరు 30న పనికి చివరి రోజు కావడంతో వారికి వేతనాలు అందజేయనున్నారు. గ్లోబల్ న్యూస్ మానిటరింగ్ కోసం ఈ ప్రాజెక్ట్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు మ్యాటర్ ఏంటంటే..
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో ఒప్పందం ముగిసిందని.. ప్రస్తుతం దీనిని మరొక సర్వీస్ ప్రొవైడర్ కు అప్పగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే తరహాలో రెండేళ్ల క్రితం దీనికోసం పనిచేసిన బుర్దా మీడియా అప్పట్లో ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే తొలగింపులకు సంబంధించిన విషయంలో HCL ప్రతినిధి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

మాంద్యం సమయంలో..
ఈ రంగానికి అతిపెద్ద మార్కెట్‌లైన అమెరికా, యూరప్ వంటి మార్కెట్‌లలో ద్రవ్యోల్బణం, రాబోయే మాంద్యం కారణంగా భారతీయ ఐటి కంపెనీలు ఇప్పటికే మార్జిన్ ఒత్తిడిని చూస్తున్న సమయంలో ఇది జరిగింది. ఇదే కారణంగా దేశీయ కంపెనీలు వేరియబుల్ పే విషయంలో కోతలు విధించాయి.

తగ్గిన నియామకాలు..
Xpheno నివేదిక ప్రకారం.. Meta, Apple, Amazon, Microsoft, Netflix, Google వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే కొత్త నియామకాలను దాదాపుగా నిలిపివేశాయి. ఇదే సమయంలోని టెక్ కంపెనీలు సైతం నియామకాలను తగ్గించాయి.


Click it and Unblock the Notifications