అమెరికాలో ఉద్యోగం చేయాలంటే రూ.88 లక్షలు కట్టాల్సిందే.. H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 21 నుంచి అమెరికాలో పనిచేయడానికి అవసరమైన H-1B వీసా కి లక్ష డాలర్ల (దాదాపు రూ. 88 లక్షలు) రుసుము చెల్లించాల్సి ఉంటుందని కొత్త ఆదేశంపై ఆయన సంతకం చేశారు. ఈ చర్య ముఖ్యంగా భారతీయులు, చైనీయులు ఎక్కువగా ఆధారపడే టెక్ రంగానికి గట్టి దెబ్బ తగలబోతోందని నిపుణులు చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మాకు మంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగులు కావాలి. కానీ అమెరికన్ కార్మికులను భర్తీ చేసే విధంగా విదేశీయులు రావడానికి మేము అంగీకరించమని చెప్పారు. ఆయన దృష్టిలో H-1B వీసా వ్యవస్థను అనేక కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయి. అందుకే రుసుమును ఇంత భారీగా పెంచినట్లు వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు.అయితే ఇది ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి వర్తించదని తెలుస్తోంది.కొత్తగా H-1B వీసా అప్లై చేసేవాళ్లకు మాత్రమేనని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. H-1B వీసా అనేది మూడేళ్ల వ్యాలిడితో వస్తుంది కాబట్టి ట్రంప్ ఆదేశాల ప్రకారం చూసుకున్నట్లయితే మూడేళ్లకొకసారి రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

H-1B వీసా అంటే ఏమిటి? H-1B అనేది అమెరికా తాత్కాలిక వర్క్ వీసా. 1990లో దీనిని ప్రారంభించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం వంటి రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా కంపెనీలు నియమించుకోవడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీసా మొదట మూడు సంవత్సరాల పాటు మంజూరు అవుతుంది, తర్వాత ఆరు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. గ్రీన్ కార్డ్ పొందితే శాశ్వతంగా పునరుద్ధరించుకోవచ్చు.
భారతీయులపై ప్రభావం: ప్రతి సంవత్సరం ఇచ్చే H-1B వీసాలలో 70 శాతం పైగా భారతీయులే పొందుతున్నారు. చైనా రెండో స్థానంలో ఉంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు వేలాది మంది భారతీయులను ఈ వీసాల ద్వారా నియమించుకుంటున్నాయి. కొత్త ఫీజు నియమం అమల్లోకి వస్తే, ప్రతి సారి రెన్యువల్ చేసుకునే సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పటికే గ్రీన్ కార్డ్ కోసం భారతీయులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త భారంతో వారికి అమెరికా కల మరింత కష్టతరం కానుంది.
పౌరసత్వ దరఖాస్తులపై కొత్త పరీక్ష: వీసాలకే కాకుండా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారికి కూడా కఠిన పరీక్షను మళ్లీ ప్రవేశపెట్టనున్నారు. ట్రంప్ 2020లో దీనిని అమలు చేయగా బైడెన్ తొలగించారు. ఇప్పుడు మళ్లీ దీన్ని ట్రంప్ తీసుకువస్తున్నారు. దరఖాస్తుదారులు అమెరికా చరిత్ర, రాజకీయం మీద 128 ప్రశ్నలు చదవాలి. వాటిలో 20 ప్రశ్నలు అడుగుతారు, 12కి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
గోల్డ్ కార్డ్ వీసా: ఇంకో ఆసక్తికర నిర్ణయం ఏమిటంటే, ట్రంప్ ఒక కొత్త గోల్డ్ కార్డ్ వీసా ప్రవేశపెట్టారు. దీనికి వ్యక్తులు అయితే 1 మిలియన్ డాలర్లు, కంపెనీలు అయితే 2 మిలియన్ డాలర్లు ఫీజు చెల్లించాలి. అమెరికాలో వ్యాపారం, ఉద్యోగాలు సృష్టించే అత్యంత ప్రతిభావంతులు మాత్రమే దీనిని పొందే అవకాశం ఉంది. ట్రంప్ ప్రకారం ఇది అమెరికాకు బిలియన్ల డాలర్లు తెచ్చిపెడుతుందని అంచనా.
ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో పని చేయాలని కలలు కనే భారతీయ టెక్నాలజీ నిపుణులకు ఇది చాలా కఠిన సమయం కానుంది. వీసా ఖర్చులు భారీగా పెరగడం వల్ల చిన్న కంపెనీలు అమెరికాకు ఉద్యోగులను పంపించడం దాదాపు అసాధ్యం అవుతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications