IT News: టెక్కీలకు వేరియబుల్ పే కష్టాలు.. కంపెనీల కఠిన నిర్ణయంతో..
Variable Pay: ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభంగా దేశీయ ఐటీ రంగం ఉంది. 2023 ప్రారంభం నుంచి ఈ రంగాన్ని సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. ఇదే తరుణంలో యాక్సెంచర్ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారతీయ ఐటీ కంపెనీలు ప్రస్తుతం పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి ఖర్చులను తగ్గించుకోవడం, లాభదాయకతను ఎలా పెంచుకోవాలనే సందిగ్ధంలో సతమతమౌతున్నాయి. ఈ పరిస్థితిలో డబ్బును ఆదా చేయడానికి ఐటీ కంపెనీలకు సులభమైన మార్గాల్లో ఒకటి సిబ్బంది ఖర్చులను తగ్గించుకోవటం. ప్రస్తుతం దేశంలోని సంస్థలు దీనిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.

టెక్కీల వేతనాల్లో ప్రధానమైనది వేరియబుల్ పే. కంపెనీలు వీటిని త్రైమాసికానికి ఒకసారి చెల్లిస్తుంటాయి. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం జూన్ తో ముగియటంతో ఉద్యోగులు వేరియబుల్ వేతనాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా పరిస్థితుల కారణంగా ఈ సారి ఇది 60-70 శాతం మధ్యలో చెల్లించేందుకు కంపెనీలు యత్నిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులు 80 శాతం వరకు వేరియబుల్ వేతనాన్ని పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని బట్టి మెరుగైన పనితీరును ప్రదర్శిస్తూ.. లాభదాయకంగా ఉన్న టీమ్‌లకు మాత్రమే వేరియబుల్ పే అమౌంట్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అడెక్కో స్టాఫింగ్ కంపెనీ సీనియర్ అధికారి ఆర్.రమేష్ అన్నారు. ఐటీ ప్రొడక్ట్ బేస్ కంపెనీలు విపరీతమైన జీతాలతో అవసరానికి మించిన సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుంటే.. మరో పక్క ఐటీ సేవల రంగంలోని కంపెనీలు మాత్రం ఉద్యోగుల ఖర్చులను మదించే పనిలో ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే టెక్ కంపెనీలు రానున్న కాలంలో లేఆఫ్స్ ప్రకటించవచ్చనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
అంతర్జాతీయ వాణిజ్యం మందగమనంతో భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోతున్నాయి. బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను, ఇప్పటికే కొనసాగుతున్న వ్యాపారాన్ని సైతం కంపెనీలు కోల్పోయాయి. ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టులను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. చిన్న ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ధోరణి కంపెనీలకు ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications