IT News: మూడు US బ్యాంకులు క్రాష్ అయినప్పటి నుంచి ఆయా కంపెనీల ఆదాయాల్లో మందగమనం పెరుగుతుందనే భయం నెలకొంది. మాంద్యం భయం తీవ్రతరం కావడంతో, టాప్ ఇండియన్ IT కంపెనీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు వైదొలగడం ప్రారంభించారు. పలు కంపెనీలు త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా బలహీనమైన ఆర్థిక స్థితిగతులను నివేదించాయి.
తాజా షేర్ హోల్డింగ్ సరళిని పరిశీలిస్తే, దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లో తమ వాటాను 44.57 నుంచి 43.08 శాతానికి తగ్గించుకున్నారు. ఇక టాప్ సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)లో FII హోల్డింగ్ వరుసగా పదో త్రైమాసికంలోనూ 12.94 నుంచి 12.72 శాతానికి కుదించబడింది.

ఇవేకాక టాటా ఎలెక్సీ, టెక్ మహీంద్రా, జెన్సార్ టెక్నాలజీస్, ఎల్ టీఐ మైండ్ ట్రీ, మాస్టెక్, ఎంఫసిస్, L&T టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, బిర్లాసాఫ్ట్ మరియు ఎఫెల్ ఇండియా వంటి ఇతర IT కంపెనీల నుంచి సైతం గత త్రైమాసికంలో FII వాటాల్లో క్షీణత నమోదైంది. టెక్ మహీంద్రా నుంచి వైదొలగడం వరుసగా 9 త్రైమాసికాల పాటు కొనసాగగా, అఫ్లే ఇండియా ఏడు త్రైమాసికాల పాటు క్షీణతతో ఇబ్బంది పడుతోంది.
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ వల్ల దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలైన TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL, టెక్ మహీంద్రా వంటి కంపెనీల త్రైమాసిక ఆదాయాలపై భారీ ప్రభావం పడింది. మార్కెట్ అంచనాలను అందుకోలేనంత బలహీన ఆర్థిక పరిస్థితిని ఆయా సంస్థలు నివేదించాయి. 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నికర జోడింపుల్లో గణనీయమైన క్షీణత ఏర్పడింది. US ప్రాంతీయ మరియు EU బ్యాంకుల్లో కొనసాగుతున్న సంక్షోభం, అననుకూల స్థూల ఆర్థిక వాతావరణం ఈ తిరోగమనానికి ఇది కారణమని చెప్పవచ్చు.
NSDL డేటా ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం నుండి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII)లు దాదాపు 7 వేల 978 కోట్లను ఉపసంహరించుకోవడంతో మార్చి త్రైమాసికంలో అమ్మకాలు దారుణంగా ఉన్నాయి. విప్రో మరియు HCL అయితే విదేశీ నిధుల ప్రవాహంలో వృద్ధిని నివేదించించాయి. విప్రోలో వరుసగా 7 త్రైమాసికాల్లోనూ విదేశీ ముదుపర్లు వాటాను తగ్గించుకున్న అనంతరం మార్చిలో తిరిగి కొంత వృద్ధి కనిపించింది. వారి వాటాను 8.67 నుంచి 8.77 శాతానికి పెంచారు. HCL టెక్ విషయానికి వస్తే FII హోల్డింగ్స్ వరుసగా 18.29 నుంచి 18.92 శాతానికి పెరిగాయి.


Click it and Unblock the Notifications