IT News: ఇన్ఫోసిస్ కాదన్నా.. HCL మాత్రం ఔనంటోంది.. మంచి కాలం మెుదలైందిగా..!!
IT News: గడచిన మూడు రోజులుగా దేశంలోని టెక్ కంపెనీల నుంచి వస్తున్న ప్రకటనలను టెక్కీలు ఆసక్తిగా గమనిస్తున్నారు. వాస్తవ పరిణామాలను తెలుసుకుంటూ.. తర్వాత ఏం చేయాలి అనే ప్లాన్ చేసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే దేశంలోనే రెండవ అతిపెద్ద టెక్ కంపెనీగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ ఈ ఏడాది తాము క్యాంపస్ హైరింగ్ నిర్వహించే ఉద్ధేశ్యంలో లేమని తేల్చి చెప్పేసింది. ఇదే క్రమంలో నవంబర్ 1 నుంచి వేతనాలను పెంచుతామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఒక పక్కన కంపెనీలు ఉన్న ఉద్యోగులకే ప్రాజెక్టులు లేక సతమతమౌతుంటే మరో పక్క కొత్తగా ఉద్యోగులను ఎలా నియమించుకుంటాయని నిపుణులు సైతం అంటున్నారు. దీంతో యువ గ్రాడ్యుయేట్లు తమ కెరీర్ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

కాలేజీ యాజమాన్యాలు సైతం సందిగ్ధంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావటంతో భారీగా తగ్గిన డిమాండ్ వల్ల టెక్ కంపెనీలు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు ప్రధాన వ్యాపార మార్కెట్లుగా ఉన్న అమెరికా, యూరోపియన్ జోన్ దేశాల్లో ద్రవ్యోల్బణం అధికంగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్యం అంచున కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకునే ఆలోచనలో అస్సలు లేవని ఇన్ఫోసిస్ చేసిన ప్రకటన స్పష్టం చేస్తోంది.
అయితే ఇన్ఫోసిస్ పోటీదారుగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ చేసిన ప్రకటన కాలేజీ యువతలో ఉత్సాహాన్ని నింపుతోంది. HCL చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ మాట్లాడుతూ కంపెనీ గత 27,000 మంది ఫ్రెషర్లను నియమించుకుందన్నారు. కంపెనీ ఈ ఏడాది మరో 10,000 మంది ఫ్రెషర్లను కొత్తగా నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతవారం ప్రకటించింది. అంటే నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న దిగ్గజ టెక్ కంపెనీ తన హైరింగ్ ప్రక్రియను కొనసాగిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ సంఖ్యలు గతంలో కంటే కొంత తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త చాలా మందికి ఊరటను కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications