IT News: టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్కీలకు గుడ్‌న్యూస్.. ఇక వారమే టైమ్..!!
Tech News: దేశీయ సర్వీస్ సెక్టార్ అందులోనూ ప్రధానంగా ఐటీ సేవలు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిలో పెద్ద పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనాలో మంచి బూమ్ చూసిన ఈ రంగం గడచిన రెండేళ్లుగా గ్లోబల్ మార్కెట్ల మందగమనంలో చిక్కుకుంది. దీంతో కంపెనీలు రిక్రూట్మెంట్ ఆపేయటంతో పాటు ఉద్యోగులకు ప్రమోషన్లు, హైక్స్, వేరియబుల్ పే వంటి ప్రయోజనాల్లో సైతం కోతలుపెట్టాయి. అయితే ఇప్పుడు ఐటీ రంగం ఈ దుర్భర పరిస్థితులను దాటినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిన వేళ సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లను వేగంగా తగ్గించటం ప్రారంభిస్తున్నాయి. దీంతో అమెరికాలోని కంపెనీలు తమ టెక్ స్పెండింగ్ పెంపును ప్రారంభించటం భారతీయ టెక్ పరిశ్రమలోని ఆటగాళ్లకు ఉపశమనాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఐటీ సేవల కంపెనీలు కొన్ని నెలలుగా కొత్త ఆర్డర్స్ పైప్ లైన్ చూస్తున్నాయి. దీని ఫలితంగా రానున్న త్రైమాసిక ఫలితాల్లో ఇది ప్రతిబింబిస్తుందని పరిశ్రమ వర్గాలు, నిపుణులు చెబుతున్నారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నార్త్ అమెరికా నుంచి దేశీయ టెక్ పరిశ్రమలోని కంపెనీలు భారీగా ఆర్టర్లను అందుకోవటం బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది. ఇది కొత్త ఉపాధి అవకాశాలకు దేశంలో తలుపులు తెరుస్తోంది.

రెండవ త్రైమాసికా కార్పొరేట్ ఫలితాల్లో ఇన్ఫోసిస్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ మంచి రాబడులను చూడవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో వారం రోజుల్లో దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ తొలుత క్వార్టర్లీ రిజల్ట్స్ అక్టోబర్ 10న ప్రకటించనుంది. దీని తర్వాత అక్టోబర్ 14న HCLTech, అక్టోబర్ 17న విప్రో ఇన్ఫోసిస్ తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇవి మార్కెట్లలో బలమైన నమ్మకాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. ఈ క్రమంలో కంపెనీల ఫలితాలు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న టెక్కీలతో పాటు మార్కెట్ ఇన్వెస్టర్లకు సైతం చాలా కీలకం. ఇప్పటికే ఉన్న నివేదిక ప్రకారం ఐటీ రంగంలో త్వరలో భారీ ఓపెనింగ్ ఉండనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి సంకేతంగా ఇప్పటికే టాప్ టెక్ కంపెనీలు రిక్రూట్మెంట్లను వేగవంతం చేయటం, గతంలో ఇచ్చిన ఆఫర్ లెటర్లకు కట్టుబడి ఆన్ బోర్డింగ్ ప్రక్రియను స్టార్ట్ చేయటం శుభపరిణామాలుగా చెప్పుకోవచ్చు.
FY25 రెండవ త్రైమాసికంలో భారతీయ ఐటీ రంగం కొంచెం మెరుగైన లాభదాయకతను ఆశిస్తోంది. ఈ వృద్ధికి హైపర్-స్కేలార్ సర్వీసెస్ సెగ్మెంట్, ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజూర్, గూగుల్ క్లౌడ్, అలాగే ఉత్తర అమెరికా మార్కెట్‌లో IT సేవలకు పెరిగిన డిమాండ్‌లో నిరంతర వృద్ధి ఆజ్యం పోసే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి భారత ఐటీ సేవల పరిశ్రమకు మంచి ఉత్తేజాన్ని ఇవ్వనుంది. ఈ క్రమంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత యూఎస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోని కంపెనీలు టెక్ సేవల్లో తమ పెట్టుబడులను పెంచుతున్నాయి. వ్యాపార వృద్ధిపై ఆశాజనకంగా ఉన్నందున సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications