IT News: ఐటీ ఉద్యోగులకు కష్టకాలం..! మాటమార్చుతున్న టెక్ కంపెనీలు.. నిరాశ తప్పదా..?
IT News: మన దేశంలో సామాన్యంగా బీటెక్ పూర్తి చేసిన వారికి చాలా గౌరవం ఇస్తుంటారు. వారికి లక్షల్లో జీతాలు వస్తాయని, విదేశాలకు వెళ్లొచ్చని.. ఇలా కోటి ఆశలతో జనం ఉండేవారు. అయితే రానురాను వారికి కష్టాలు మెుదలవుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా కాలం తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. అసలు వారికి తాజాగా వచ్చిన కష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఉద్యోగుల జేబులపై ప్రభావం..
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ వేతనాల విషయంలో పెద్ద బాంబు పేల్చింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల జేబులపై పెను ప్రభావం చూపనుంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సగటు వేరియబుల్ చెల్లింపులను 70 శాతానికి తగ్గించింది. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులకు కూడా తెలియజేసింది.

ఒకే దారిలో దిగ్గజాలు..
మార్జిన్లు తగ్గడం, ఉద్యోగుల ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విప్రో మార్జిన్లు తగ్గిపోవడం, టెక్నాలజీలో పెట్టుబడి కారణంగా ఉద్యోగుల 'వేరియబుల్ పే'ని కూడా నిలిపివేసింది. మరో ఐటీ దిగ్గజం అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా కొంతమంది ఉద్యోగుల త్రైమాసిక వేరియబుల్ వేతనాన చెల్లింపును ఒక నెల వాయిదా వేసింది.

మాంద్యం భయాలతో..
గత నెల జూన్ త్రైమాసికంలో పెరుగుతున్న ఖర్చుల మధ్య ఇన్ఫోసిస్ నికర లాభం 3.2 శాతం పెరిగింది . అయితే.. ఇది కంపెనీ అంచనా వేసిన దాని కంటే తక్కువని తెలుస్తోంది. అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం ఆందోళనలు IT కంపెనీల ఇబ్బందులను పెంచాయి. ఆర్థిక మందగమన భయాల కారణంగా అతిపెద్ద గ్లోబల్ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగ నియామకాలు నిలిపివేయగా, ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల కోతలను ప్రకటిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు..
గ్లోబల్ ఐటి వ్యయం మెరుగుపడిన నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనా 14-16 శాతానికి పెరిగింది. ఇది చాలా సంతృప్తికరంగా ఉందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ గత వారం వ్యాఖ్యానించారు. అమెరికా, యూరప్ మార్కెట్లలో కంపెనీ బలంగానే ఉందని పరేఖ్ వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న నేపథ్యంలో కంపెనీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సీఈవో వెల్లడించారు.


Click it and Unblock the Notifications