IT News: టెక్కీల కొత్త కిటుకు.. సీరియస్‌గా తీసుకుంటున్న ఐటీ కంపెనీలు..!
IT News: గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్న వ్యాపారాన్నైనా నిలుపుకోవాలని ఐటీ కంపెనీలు ఒకపక్క తంటాలు పడుతున్నాయి. ఇదే సమయంలో మరోపక్క ఉద్యోగులు మాత్రం కంపెనీలను బురిడీ కొట్టించే పనిలో బిజీగా ఉంటున్నారు.
కంపెనీలు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కొత్త కొత్త ప్లాన్లతో తమ పని తాము సాఫీగా కానిచ్చేస్తున్నారు. వాస్తవానికి కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో చేసేది లేక ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని అందించాయి. దీనికి చాలా మంది బాగా అలవాటు పడ్డారు. ఈ క్రమంలో క్వైట్ క్విట్టింగ్, రేజ్ అప్లయింగ్, గ్రేట్ రెసిగ్నేషన్, మూన్ లైటింగ్ అంటూ కొత్త ట్రెండ్స్ బయటకు వచ్చాయి. తాజాగా ఈ కోవలో కాఫీ బ్యాడ్జింగ్ అనే సంస్కృతి మెుదలైంది. చాలా మంది ప్రస్తుతం దీనిని అవలంభించటంతో కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి.

ఇటీవలి కాలంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను ఫుల్ టైమ్ ఆఫీసులకు రావాలని తెలిపాయి. అలాగే మరికొన్ని హైబ్రిడ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. కాఫీ బ్యాడ్జింగ్ చేస్తున్న ఉద్యోగులు ముందుగా ఆఫీసులకు రాగానే తమ ఐడీ కార్డులను స్వైప్ చేస్తారు. తర్వాత కొలీగ్స్ తో కలిసి ఆఫీసు క్యాంటీన్ వద్ద కాఫీ తాగుతూ కొంత సమయం గడుపుతారు. ఈ క్రమంలో తాము ఆఫీసులకు వచ్చాం అనే విషయం హెచ్ ఆర్, టీమ్ మేనేజర్ల కంట పడేటట్లు కొద్ది సేపు కారిడార్లలో తిరుగుతారు. ఈ తంతు పూర్తి కాగానే పని పూర్తైపోయినట్లు ఇళ్లకు వెళ్లిపోతారు. అంటే మెుక్కుబడికి ఆఫీసులకు వచ్చి అలా కొంత సేపు గడిపి వెళ్లిపోతారనమాట.
టెక్కీలు ఆఫీసులకు వచ్చి ఇలా కాఫీ బ్యాడ్జింగ్ చేయటం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త వారికి, ఖచ్చితంగా ఆఫీసుల నుంచి పనిచేసే కేటగిరీలోని ఉద్యోగులకు ఇది నిరుత్సాహపరుస్తుందని వారు చెబుతున్నారు. దీనికి తోడు ఆఫీసులకు వెళ్లటం అనేది పెద్ద పనిభారం అనే ధోరణి పెరుగుతుందని.. కంపెనీలు సైతం దీనిని త్వరగా కట్టడి చేయాలని వారు అంటున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఉద్యోగులపై దేశీయ టెక్ కంపెనీలు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications