AI ప్రభావం: ఐటీ దిగ్గజాల బ్రాండ్ విలువ మటాష్! అసలు ఏమైంది?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వేగంగా విస్తరించడం, పాతతరం వ్యాపార నమూనాలలో వస్తున్న మార్పుల కారణంగా భారతదేశంలోని టాప్ ఐటీ కంపెనీలు గట్టి దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ ఐటీ సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
కాంతార్ (Kantar) విడుదల చేసిన 'బ్రాండ్స్ 2026' ర్యాంకింగ్స్ నివేదిక ప్రకారం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో బ్రాండ్ విలువలు గత ఏడాదితో పోలిస్తే భారీగా పడిపోయాయి. అత్యధికంగా టీసీఎస్ బ్రాండ్ విలువ 45% క్షీణించగా, ఇన్ఫోసిస్ 41%, విప్రో 40% చొప్పున నష్టపోయాయి.
ఐటీ కంపెనీలు తమ సేవలను అందించే విధానంలో AI తీసుకొస్తున్న మార్పుల వల్ల, సాంప్రదాయ వ్యాపారాలు ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయో ఈ పతనం స్పష్టంగా చూపిస్తోందని ఆ నివేదిక పేర్కొంది.

భారత్‌లోని టాప్ 3 ఐటీ కంపెనీలే కాకుండా, హెచ్‌సీఎల్ టెక్, ఎల్టీఐ మైండ్‌ట్రీ వంటి సంస్థల బ్రాండ్ విలువలు కూడా గణనీయంగా తగ్గాయి. భారత బ్రాండ్ల విలువలు ఇలా బలహీనపడటానికి ఆర్థిక పరిస్థితులు ఒక కారణమైనప్పటికీ, ముఖ్యంగా బిజినెస్ సర్వీసెస్ రంగంలో AI సృష్టిస్తున్న గందరగోళమే దీనికి ప్రధాన కారణమని కాంతార్ స్పష్టం చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇండియా B2B (బిజినెస్-టు-బిజినెస్) రంగాన్ని పూర్తిగా మార్చేస్తోందని, ఇది కొత్త అవకాశాలను సృష్టిస్తూనే, పాత వ్యాపార నమూనాలకు సవాలుగా నిలుస్తోందని నివేదిక తెలిపింది. భారతదేశంలోని 100 అత్యంత విలువైన బ్రాండ్ల మొత్తం విలువ, గత ఏడాదితో పోలిస్తే 12% తగ్గి $460 బిలియన్లకు పడిపోయిందని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా కన్సల్టెన్సీ సంస్థలపై AI ప్రభావం, దానివల్ల బ్రాండ్ విలువ తగ్గడం ఎక్కువగా ఉందని వెల్లడించింది.
గడిచిన కొన్నేళ్లుగా భారత ఐటీ కంపెనీలకు సవాలుగా మారాయి. ఎందుకంటే, AI టెక్నాలజీ రాకతో ఐటీ ప్రొడక్టులను తయారు చేయడం, సేవలు అందించడం, బిల్లింగ్ చేయడం వంటి అన్ని విషయాల్లోనూ భారీ మార్పులు వచ్చేశాయి.
ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగులను సిద్ధం చేయాల్సిన అవసరం ఐటీ కంపెనీలకు ఏర్పడింది. అలాగే, పాత బిజినెస్ మోడల్స్ స్థానంలో AI ఎకానమీకి సరిపోయే కొత్త వ్యాపార నమూనాలను రూపొందించుకోవాల్సిన ఒత్తిడి కూడా పెరిగింది. అందుకే భారత ఐటీ కంపెనీలకు ఇది ఒక గడ్డు కాలమని ఈ నివేదిక విశ్లేషించింది.
ఐటీ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు ఈ నివేదిక చాలా కీలకమైనది. ఎందుకంటే, చాలా కంపెనీలు AIని కారణంగా చూపి ఉద్యోగులను తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో, తమ ఉద్యోగాలను కాపాడుకోవాలంటే ఐటీ ఉద్యోగులు AI రంగంలో నైపుణ్యం సాధించడం తప్పనిసరి అని ఇది స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications