భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..
భారతదేశంలో బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో అసోచామ్ (ASSOCHAM) నివేదిక వెల్లడించిన గణాంకాలు భారతీయ ఆర్థిక వ్యవస్థలో గృహాల వద్ద ఉన్న బంగారం యొక్క అపారమైన శక్తిని, దాని ప్రాముఖ్యతను కళ్ళకు కడుతున్నాయి. భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది తరతరాలుగా వస్తున్న ఒక సామాజిక భద్రత, సంపదకు చిహ్నంగా ఉంది.
ఈ నివేదిక ప్రకారం, భారతీయ కుటుంబాల వద్ద ఉన్న సుమారు 5 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం, ప్రపంచంలోని మొదటి పది కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం నిల్వల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. అంతేకాకుండా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ కంటే కూడా ఈ బంగారు నిల్వల విలువ అధికంగా ఉండటం గమనార్హం. ఇది మన దేశంలోని ప్రైవేట్ సంపద యొక్క పటిష్టతను చాటిచెబుతోంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల GDPని కూడా ఈ Gold అధిగమించింది. ఇది దేశంలోని అపారమైన ప్రైవేట్ సంపదను ప్రతిబింబిస్తుంది.

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంతో పోల్చినప్పుడు, అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల వార్షిక జీడీపీ మినహా, మిగిలిన దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే భారతీయ గృహాల వద్ద ఉన్న బంగారం విలువ ఎక్కువగా ఉంది. అయితే, ఈ అపారమైన సంపదలో మెజారిటీ భాగం ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఇళ్లలోనే నిశ్చలంగా ఉండిపోవడంతో, దేశ ఆర్థిక వృద్ధికి అది ప్రత్యక్షంగా తోడ్పడలేకపోతోంది. ప్రస్తుతం ఈ బంగారం ఒక "స్తబ్ద ఆస్తి"గా మిగిలిపోయింది. దీనిని ఉత్పాదక రంగాల వైపు మళ్ళించడం ద్వారా దేశ ముఖచిత్రాన్ని మార్చవచ్చని నివేదిక స్పష్టం చేస్తోంది.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, బంగారు రుణాలు, ఇతర డిజిటల్ లేదా పొదుపు ఉత్పత్తుల ద్వారా ఈ నిశ్చల సంపదను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం అత్యవసరం. ఇలా చేయడం వల్ల తయారీ రంగం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ రంగాలకు అవసరమైన భారీ పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయి. నివేదిక అంచనా ప్రకారం, ప్రతి సంవత్సరం దేశీయంగా ఉన్న బంగారంలో కేవలం 2 శాతం మాత్రమే ఆర్థిక వ్యవస్థలోకి మళ్ళించగలిగితే, 2047 నాటికి సుమారు 40 శాతం బంగారం వ్యవస్థీకృతమై దేశ వృద్ధిలో భాగస్వామ్యం అవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఆర్థిక వ్యవస్థకు అదనంగా 7.5 ట్రిలియన్ డాలర్ల మేర లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల 2047 నాటికి భారతదేశ సంభావ్య జీడీపీ 34 ట్రిలియన్ డాలర్ల నుండి ఏకంగా 41.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.
ఇటీవలి కాలంలో బంగారు రుణాల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరగడం సానుకూల పరిణామం. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం అనేది ఇప్పుడు ఒక ప్రధాన మార్గంగా ఉద్భవించింది. అయినప్పటికీ, ఈ రంగం యొక్క పూర్తి సామర్థ్యం ఇంకా వినియోగంలోకి రాలేదు. పెరిగిన బంగారం ధరలు గృహాల ఆస్తుల విలువను పెంచినప్పటికీ, ఆ సంపదను కేవలం ఆభరణంగా చూడకుండా ఒక ఆర్థిక ఇంధనంగా మార్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు సామాన్యులకు భరోసా కల్పిస్తూ, పారదర్శకమైన పథకాల ద్వారా ఈ బంగారాన్ని బయటకు తీసుకురాగలిగితే, విదేశీ పెట్టుబడులపై ఆధారపడటం తగ్గి స్వదేశీ వనరులతోనే భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగగలదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications