Rice Exports: బియ్యం ఎగుమతులపై బ్యాన్ విధించిన కేంద్ర ప్రభుత్వం.. పూర్తి వివరాలు..
Rice Exports: గడచిన కొన్ని నెలలుగా దేశంలో ఆహార ఉత్పత్తుల ధరలు మండిపోతున్నాయి. బియ్యం ధరలు ఏకంగా ఆకాశానికి ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో గతవారం రోజులుగా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
నేడు బాస్మతీయేతర తెల్లం బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఈ లెక్కన కేవలం బాస్మతీ రకం బియ్యం ఎగుమతులకు మాత్రమే ఇకపై అనుమతులు వర్తిస్తాయి. కేవలం సెమీ-మిల్డ్ లేదా పూర్తిగా మిల్లింగ్ రైస్, పాలిష్ లేదా గ్లేజ్ చేయకపోయినా సదరు బియ్యం ఎగుమతులు చేయటానికి నిషేధించబడింది.

అయితే నోటిఫికేషన్ విడుదలకు ముందరే షిప్పుల్లో లోడ్ చేయబడిన బియ్యం ఎగుమతులకు మాత్రమే ప్రస్తుతం అనుమతి ఉందని షరతుల్లో వెల్లడించింది. దీనికి ముందు ప్రభుత్వం ఇటుగా అడుగులు వేస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. తాజా నిర్ణయం వల్ల దేశంలోని దాదాపు 80 శాతం బియ్యం ఎగుమతులు ప్రభావితం అవుతాయని వెల్లడైంది. ఈ నిర్ణయం వల్ల ఇండియాలో పెరుగుతున్న బియ్యం ధరలకు కళ్లెం పడనుండగా.. ఇదే సమయంలో సరఫరా నిలిచిపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని కీలకమైన వరి పండించే ప్రాంతాల్లో వర్షపాతం అసమాన పంపిణీ కారణంగా గత 10 రోజుల్లో ధాన్యం ధరలు 20% వరకు పెరిగినట్లు గతవారం నివేదికలు వచ్చాయి. అలాగే ఎల్ నినో ప్రభావంపై దేశంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అధిక వర్షాలతో పంట నష్టం జరిగి నిత్యావసరాలు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు భారత్ ఆంక్షల దిశగా అడుగులు వేయగా.. వియత్నాం నుంచి ఎగుమతి అవుతున్న బియ్యం ధరలు ఈ వారంలో ఒక దశాబ్దానికి పైగా గరిష్ఠ స్థాయికి పెరిగాయి.
అలాగే వరి సేకరణ ధరను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య రేట్లను పెంచుతున్నట్లు బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బివి కృష్ణారావు వెల్లడించారు.


Click it and Unblock the Notifications