Gold Bond Scheme: నేటి నుంచే గోల్డ్ బాండ్స్ అమ్మకాలు.. ఇన్వెస్ట్ చేసే ముందు ఇవి తెలుసుకోండి..
Gold Bond Scheme: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. అయితే దీని వల్ల భారీగా విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఇది ఫారెక్స్ నిల్వలు తరిగిపోవటానికి కారణంగా నిలుస్తోంది. ఈ తరుణంలో గోల్డ్ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయంగా సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పెట్టుబడిదారులకు..
స్టాక్ మార్కెట్లలో అస్థిరతల కారణంగా చాలా మంది తమ పెట్టుబడుల పోర్ట్ ఫోలియోను వైవిధ్యపరుతునేందుకు బంగారాన్ని అందులో చేర్చాలని భావిస్తున్నారు. ఇందుకోసం వారికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ చివరి విడత నేటి నుంచి అందుబాటులోకి వస్తోంది. ఈ క్రమంలో గ్రాముకు ఇష్యూ ధరను రూ.5,611గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందు విడతలో బాండ్స్ విడుదల చేసినప్పుడు గ్రాముకు ధర రూ.5,409గా ఉంది. ఈరోజు ప్రారంభమైన ఇష్యూ మార్చి 10 వరకు అందుబాటులో ఉండనుంది.

నిపుణుల సూచన..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం, రాబోయే గ్లోబల్ అస్థిరత, ఈక్విటీ మార్కెట్ల పనితీరును పరిగణనలోకి తీసుకుంటే గోల్డ్ మంచి రాబడులను అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెుత్తం పెట్టుబడుల్లో దాదాపు 10-15 శాతం డబ్బును బంగారంలో ఇన్వెస్ట్ చేయటం ఉత్తమని వారు సూచిస్తున్నారు.

సావరిన్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన విషయాలు..
1. సావరిన్ గోల్డ్ బాండ్‌లు భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జారీ చేసే సెక్యూరిటీలు. ఇందులో డిజిటల్ గా బంగారాన్ని గ్రాములుగా విభజిస్తారు.
2. ప్రభుత్వ గ్యారెంటీ ఉన్నప్పటికీ.. SGBలలో బంగారానికి భౌతిక మద్దతు ఉండదు.
3. SGB ఇతర డిజిటల్ ఆస్తులకు భిన్నంగా ఉంటుంది. ఇవి ఏడాదికి 2.50 శాతం వడ్డీ రేటును అందిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో ప్రస్తుత మార్కెట్ ధరల్లో బంగారం విలువ వడ్డీ ఆదాయంతో పాటు తిరిగి ఇవ్వబడుతుంది. బంగారం ధరలు మార్కెట్ శక్తులచే నడపబడుతున్నాయి.. అందువల్ల ధరలు ఏ విధంగానైనా మారవచ్చని గుర్తుంచుకోండి.
4. ఇష్యూ ధరకు GST, ఇతర ఛార్జీలు జోడించబడనందున.. బంగారం కొనుగోలు చేయడానికి ఇది చౌకైన మార్గాల్లో ఒకటిగా ఉంది.
5. సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలో చివరి మూడు రోజుల బంగారం ధరలో సగటును రేటుగా నిర్ణయించటం జరుగుతుంది. ఈ రేట్లను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించింది. రేట్లను నిర్ణయించడానికి 999 స్వచ్ఛమైన బంగారం ధరను పరిగణలోకి తీసుకోవటం జరుగుతోంది.
6. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ఇన్వెస్టర్లు.. డిజిటల్ మోడ్‌లో చెల్లింపుదారులకు గ్రాముపై రూ. 50 తగ్గుతాయి.
7. ఈ బాండ్లలో ఏడాదికి గరిష్టంగా 4 కిలోల వరకు బంగారాన్ని పెట్టుబడి కోసం గరిష్ఠంగా కొనుగోలు చేయవచ్చు. అలాగే కేవలం ఒక్క గ్రాము నుంచి ఇన్వస్టర్లు తమ పెట్టుబడి ప్రయాణాన్ని మెుదలు పెట్టవచ్చు.
8. కేంద్రం విడుదల చేస్తున్న ఈ బాండ్స్ 8 ఏళ్ల కాలపరిమితితో వస్తాయి. అయితే మీరు వడ్డీ చెల్లింపు తేదీల్లో 5, 6, 7 సంవత్సరాల్లో పెట్టుబడి నుంచి నిష్క్రమించవచ్చు. అయితే మధ్యలోనే దీని నుంచి బయటకు రావాలంటే.. పెట్టుబడిదారుడు కూపన్ చెల్లింపు తేదీకి కనీసం ఒక రోజు ముందు సంబంధిత బ్యాంక్/పోస్టాఫీసును సంప్రదించాలి.
9. మీరు SGBలో పెట్టుబడి పెట్టినప్పుడు హోల్డింగ్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. సర్టిఫికేట్ బంగారం కలిగి ఉన్నట్లు రుజువు. మీరు దీన్ని డీమ్యాట్ రూపంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తక్కువ లిక్విడిటీ కారణంగా కొన్నిసార్లు ఎక్స్ఛేంజీల్లో విక్రయించడం కష్టంగా ఉంటుంది.
10. మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత SGB రిడీమ్‌పై ఎలాంటి పన్ను విధించబడదు. అంటే చివరిగా వచ్చే ఆదాయం పన్ను రహితమైనది. ఒకవేళ 36 నెలల ముందు విక్రయిస్తే.. అందులో వచ్చే ఆదాయం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద పన్ను విధించబడుతుంది.


Click it and Unblock the Notifications