Onion Prices: దేశంలో కురిసిన భారీ వర్షాలు అనేక పంటలను నాశనం చేశాయి. దీంతో వరుసగా నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల టమాటా చుక్కలు చూపించగా.. ఉల్లి సైతం అదే దారిలో పయనిస్తోంది.
ఉల్లి ఎగుమతుల్లో భారత్ అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసిందే. గడచిన మూడేళ్ల కాలంలో భారత్ అత్యధికంగా ఉల్లిపాయలను ఎగుమతి చేసింది. అయితే తాజాగా ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని వివిధ మార్కెట్లలో హోల్ సేల్ ధరలు పెరిగటంతో ఈ చర్య చేపట్టింది. దేశీయంగా సరఫరాను పెంచే ఉద్ధేశంతో మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో అతిపెద్ద ఉల్లిపాయల హోల్‌సేల్ మార్కెట్ అయిన లాసల్‌గావ్‌లో క్వింటాలు ధర రూ.1,000-1,100 నుంచి ఆగస్టులో రూ.2,200-2,300/క్వింటాల్ మార్కును దాటింది. మార్కెట్లకు ఊహించిన దాని కంటే తక్కువగా సరకు రావటంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో అనేక రిటైల్ మార్కెట్లలో కిలో ఉల్లిపాయలు రూ.30-35 చొప్పున విక్రయించబడుతున్నాయి. ఎగుమతిదారులు, వ్యాపారులు ఈ సుంకం భారతీయ మార్కెట్లలో ధరలను తగ్గించడంలో పెద్దగా సహాయపడదని భావిస్తున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 25.25 లక్షల టన్నుల బల్బును ఎగుమతి చేసినట్లు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి ప్రమోషన్ డెవలప్‌మెంట్ అథారిటీ(APEDA) డేటా చెబుతోంది. 2021-22లో 15.37 లక్షల టన్నులు, 2020-21లో 15.78 లక్షల టన్నులతో పోలిస్తే ఇది అత్యధిక ఎగుమతి. మన ఉల్లికి బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాల నుంచి అత్యధికంగా డిమాండ్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో వర్షాలు కురుస్తుండడంతో పాటు వేడిగాలులు వీయడంతో నిల్వ చేసిన పంట నాణ్యత దెబ్బతింది.


Click it and Unblock the Notifications