Swiss Banks: కేంద్రానికి అందిన స్విస్ ఖాతాల జాబితా.. నాలుగో విడత లిస్ట్ వచ్చేసింది
Black Money: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు కోట్లాది రూపాయలను దాచినట్లు వార్తలు ఎప్పటి నుంచో వింటున్నాం. అయితే ఈ నల్ల డబ్బును మన దేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అక్రమంగా స్విస్ బ్యాంకుల్లో భారతీయ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు భారీగా డిపాజిట్లు చేశారని చెబుతున్నారు. వీటి వివరాలను అందించేందుకు గతంలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

నాలుగో జాబితా..
స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న ధనికులపై ప్రభుత్వం మళ్లీ గొప్ప విజయం సాధించింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్విస్ బ్యాంకులు భారతీయ ఖాతాదారుల జాబితాను మరోసారి విడుదల చేశాయి. భారత్‌కు లభించిన నాల్గవ జాబితా ఇది. ఇందులో అనేక ట్రస్ట్‌లు, కంపెనీల ఖాతాలు కూడా ఉన్నాయి. దర్యాప్తు ప్రభావితం కాకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వీటి వివరాలను బహిర్గతం చేయలేదని తెలుస్తోంది.

34 లక్షల ఖాతాలు..
స్విట్జర్లాండ్ భారతదేశంతో సహా 101 దేశాలకు.. 34 లక్షల ఖాతాదారులకు సంబంధించిన వివరాలను పంచుకుంది. ఇందులో భారత్ కు చెందిన వందల మంది ఖాతాదారుల వివరాలు ఉండటం విశేషం. వరుసగా నాలుగోసారి వివరాలు పంచుకున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ఈ సమాచారాన్ని గత నెలలో అన్ని దేశాలకు పంపినట్లు ఎఫ్‌టీఏ తెలిపింది. దీని తరువాతి జాబితాను సెప్టెంబర్ 2023 స్విట్జర్లాండ్ అందించనున్నట్లు తెలుస్తోంది.

ఆ దేశాలకు అందని సమాచారం..
స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఖాతాల వివరాలను ఆ దేశం కొన్ని దేశాలతో మాత్రం ఇప్పటి వరకు పంచుకోలేదు. రష్యాతో సహా 27 దేశాలకు ఈ వివరాలను పంచుకోలేదని తెలుస్తోంది. భారత్ కూడా ఈ వివరాలను మోదీ ప్రభుత్వ హయాంలోనే తెలుసుకోగలిగింది. నాలుగో జాబితాలో ఆగ్నేయాసియా దేశాలు, అమెరికా, ఇంగ్లండ్, కొన్ని యూరప్ దేశాల్లో నివశిస్తున్న భారతీయుల వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

2019లో తొలిసారిగా..
నరేంద్ర మోదీ ప్రధాని కావటానికి ముందు బ్లాక్ మనీని మన దేశానికి తెచ్చి అంతరి బ్యాంక్ ఖాతాల్లో వాటిని వేస్తానంటూ ఎన్నికల వాగ్ధానం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అలా సెప్టెంబరు 2019లో స్విస్ బ్యాంకుల నుంచి ప్రభుత్వం తొలి జాబితాను అందుకుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఈ వివరాలు పంచుకుంటామని అనేక దేశాలతో ఒప్పందాలపై స్విస్ ప్రభుత్వం సంతకం చేసింది.

ఇందులో ఏ వివరాలు ఉంటాయి..
స్విస్ బ్యాంకు అందించిన సమాచారంలో ఖాతాదారుల పేరు, చిరునామా, నివాస దేశం, పన్ను గుర్తింపు సంఖ్య వంటి వివరాలు ఉంటాయి. స్విస్ బ్యాంకుల్లో లెక్కలు చూపని డబ్బు ఉంచిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు ఈ జాబితా ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అక్రమంగా డబ్బు డిపాజిట్ చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications