Rice Exports: బియ్యం ఎగుమతుల బ్యాన్ దిశగా భారత్.. ఉడుకు ఆగేనా..??
Rice Exports: గతంలో ఎన్నడూ లేని విధంగా ఆహార ద్రవ్యోల్బణం ఇండియాను వేధిస్తోంది. ఒకటి తర్వాత మరొక నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. తాజాగా బియ్యం కూడా ఇందులో చేరిపోయింది.
ఇప్పటి వరకు చాలా కాలంగా ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా భారత్ కొనసాగుతోంది. చాలా బియ్యం వెరైటీలను మన దేశం ఎగుమతి చేస్తుంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల రీత్యా.. ముఖ్యంగా బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నారు. ధరల కట్టడికి ఇది చాలా కీలకమని నిపుణులు భావిస్తున్నారు.

దేశంలో వరి సాగు జరిగే కీలక ప్రాంతాల్లో అసమాన వర్షపాతం పంపిణీ కారణంగా ధరలకు రెక్కలొచ్చాయి. గత 10 రోజుల్లో బియ్యం ధరలు ఏకంగా 20% పెరుగుదల నమోదైంది. ఈ క్రమంలో ఎగుమతులపై నిషేధం విధించాలని, దేశంలో ధరలను స్థిరీకరించాలని మోదీ సర్కార్ చూస్తోంది. ప్రతిపాదిత నిషేధం భారతదేశ బియ్యం ఎగుమతుల్లో దాదాపు 80% ప్రభావితం చేయవచ్చని అంచనా వేయబడింది. ఇది ఖచ్చితంగా ధరలను తగ్గించవచ్చని తెలుస్తోంది.
చాలా కాలంగా ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో ఇండియాకు 40% వాటా ఉంది. దీనికి తోడు ప్రపంచంలో దాదాపు సగం జనాభాకు బియ్యం ఒక ప్రధాన ఆహారంగా ఉంది. దీనికి తోడు 90 శాతం వినియోగం ఆసియాలోనే జరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో పాటు ఎల్‌నినో కారణంగా దిగుబడి భారీగా దెబ్బతింటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉత్పత్తి తగ్గుదల కారణంగా ప్రస్తుతం దేశంలో బియ్యం ధరలు రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications