Gold Imports: దుబాయ్ నుంచి భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న ఇండియా వ్యాపారులు..!
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం.. ధర పెరిగిన కూడా పసిడిని భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి భారీగా పుత్తడిని దిగుమతి చేసుకుంటోంది. ఇటీవలి కాలంలో ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) విడుదల చేసిన డేటా ప్రకారం, ఇతర దేశాలతో పోలిస్తే దుబాయ్ నుంచి బంగారం దిగుమతుల పరిమాణం భారీగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే భారతదేశపు బంగారు బిస్కెట్ల దిగుమతులు 47.1 శాతం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచినప్పటికీ, బంగారు దిగుమతులు తగ్గలేదు.
భారతదేశం ఈ జూన్‌లో యూఏఈ నుంచి $649.4 మిలియన్ల విలువైన పసిడిని దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాది జూన్‌లో ఈ సంఖ్య 235.9 మిలియన్ డాలర్లు ఉండగా, ఈ ఏడాది 175.2 శాతం పెరిగింది. అదే సమయంలో, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతులు 17.7 శాతం తగ్గాయి. జూన్ నెలలో భారత్ మొత్తం బంగారం దిగుమతుల్లో దుబాయ్ నుంచి భారీగా దిగుమతి చేసుకుంది. బంగారం దిగుమతులలో దుబాయ్ వాటా గత ఏడాది 12.8 శాతం నుంచి ఈ ఏడాది 33 శాతానికి పెరిగింది. ఇరాన్ యుద్ధం కారణంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మే 13న బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

భారత్.. దుబాయ్ నుంచి ఎక్కువ బంగారం దిగుమతి చేసుకోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇండియా, యూఏఈల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులో ఉన్న నేపథ్యంలో
బంగారం దిగుమతులపై పన్ను మినహాయింపు ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం మీరు యూఏఈ నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటే కేవలం 14 శాతం దిగుమతి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే ఇతర దేశాలకు అయితే 15 శాతం ఉంటుంది. అంటే ఇతర దేశాలతో పోలిస్తే యూఏఈ నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటే పన్ను 1 శాతం తక్కువగా ఉంటుంది. ఈ ఒక శాతం పన్ను తక్కువగా ఉండడంతో దుబాయ్ నుంచి పసిడి దిగుమతి పెరిగింది.
కొంత మంది వ్యాపారులు ఇతర దేశాల నుంచి కూడా యూఏఈ ద్వారా భారతదేశానికి బంగారాన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఒక శాతం పన్ను రాయితీ కారణంగానే భారతీయ వ్యాపారవేత్తలు దుబాయ్ నుంచి అధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్నారని చెబుతున్న జీటీఆర్ఐ సంస్థ, ఇరు దేశాల మధ్య ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దుర్వినియోగం అవుతోందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
