బ్రిటిష్ సామ్రాజ్యం అంటే ఒకప్పుడు సూర్యుడు అస్తమించని రాజ్యం అని పేరు. అలాంటి మహా సామ్రాజ్యమే ఒక సామాన్య భారతీయ వ్యాపారవేత్త దగ్గర అప్పు తీసుకుందంటే నమ్ముతారా? ఇది ఏదో సినిమా కథ కాదు. నిజంగా జరిగింది. మధ్యప్రదేశ్‌లోని సీహోర్ పట్టణంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక కథనం ప్రకారం.. దాదాపు 109 ఏళ్ల క్రితం అంటే 1917లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక భారతీయ కుటుంబం నుంచి తీసుకున్న అప్పును ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదట. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు తమ డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పుడీ వార్త నెట్టింట ట్రెండింగ్ (Trending) గా మారింది.

అప్పట్లో రూ. 35 వేలు.. ఇప్పుడైతే కోట్లు!
సీహోర్ కు చెందిన సేథ్ జుమ్మాలాల్ రుథియా ఆ కాలంలో అత్యంత ధనిక, ప్రభావవంతమైన వ్యాపారవేత్త. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో.. పరిపాలన సాగించడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడింది. ఆ సమయంలో వారు జుమ్మాలాల్ నుంచి రూ. 35,000 అప్పుగా తీసుకున్నారు. దీనిని 'వార్ లోన్' (War Loan) అని పిలిచేవారు. 1917వ సంవత్సరంలో 35 వేల రూపాయలు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆనాటి బంగారు ధరలతో పోలిస్తే, దాని విలువ నేడు వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా.
పాత రికార్డుల్లో దొరికిన ఆధారాలు
జుమ్మాలాల్ రుథియా మనవడు వివేక్ రుథియా ఈ విషయాన్ని బయటపెట్టారు. తన తండ్రి మరణం తర్వాత పాత రికార్డులు, వీలునామాలు వెతుకుతుండగా ఈ అప్పుకు సంబంధించిన పత్రాలు, సర్టిఫికెట్లు దొరికాయని ఆయన చెబుతున్నారు. "మా తాతగారు బ్రిటిష్ వారికి అప్పట్లో పెద్ద మొత్తంలో సహాయం చేశారు. కానీ, ఆ బాకీ ఇప్పటివరకు తీరలేదు" అని వివేక్ పేర్కొన్నారు. దీనిపై చట్టపరమైన పోరాటం చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు. త్వరలోనే బ్రిటిష్ ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపాలని భావిస్తున్నారు.
చట్టపరమైన సవాళ్లు ఏంటి?
అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. ఒక దేశం లేదా ప్రభుత్వం మారినప్పటికీ పాత ప్రభుత్వాలు చేసిన సార్వభౌమ రుణాలను (Sovereign Debt) తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే వందేళ్ల క్రితం నాటి వ్యవహారం కావడం, అది వలస పాలన నాటిది కావడంతో ఈ కేసు ఎంతో సంక్లిష్టంగా మారుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. అయినప్పటికీ పక్కాగా డాక్యుమెంటరీ ఆధారాలు ఉంటే అంతర్జాతీయ కోర్టుల్లో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.
రుథియా కుటుంబం నేపథ్యం
స్వాతంత్ర్యానికి పూర్వం రుథియా కుటుంబం సీహోర్ , భోపాల్ సంస్థానాల్లో అత్యంత పలుకుబడి ఉన్న కుటుంబం. సీహోర్ పట్టణంలోని సుమారు 20 నుంచి 30 శాతం భూమి ఒకప్పుడు వీరిదేనని చెబుతుంటారు. ఇప్పటికీ వీరికి ఇండోర్, భోపాల్ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం వారు రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, హాస్పిటాలిటీ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాత అప్పు వ్యవహారం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ ట్రెండింగ్ (Trending) అవుతోంది.


Click it and Unblock the Notifications