Initial Indian economy: ఏళ్ల తరబడి బ్రిటీష్ కబంధ హస్తాల్లో నలిగిపోయిన భారత్.. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. సొంత కాళ్లపై నిలబడేందుకు రెడీ అయింది. అయితే ఇండియా సంపదను అప్పటికే బ్రిటీష్ వారు రైళ్లలో ఇంగ్లాండ్ తరలించుకుపోవడంతో వేగంగా ఎదగలేక చతికిలపడింది. కానీ ఏమాత్రం పట్టు విడవకుండా ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు ఆమడ దూరంలో ఉంది. ఇదంతా ఈజీగా ఏమీ జరగలేదు. ఎన్నో సమస్యలను అధిగమించాల్సి వచ్చింది. అసలు మన స్వతంత్ర భారత్ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా..? అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకుందాం.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఒకవైపు బ్రిటీష్ పాలకులు వనరులను దోపిడీ చేస్తుంటే మరోవైపు యుద్ధాలు, స్వాతంత్య్ర పోరాటాల కారణంగా అనేక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. వీటికితోడు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అడ్డుకట్టు వేస్తూ చాలా వస్తువుల కోసం భారతీయులను దిగుమతులపై ఆధారపడి ఉండేలా మలచారు. దీంతో 1947 ఆగస్టు 15 నాటికి ఇండియా తక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశంగా నిలిచింది.

ధనికులు మరియు పేదల మధ్య అప్పుడు భారీ అంతరం ఏర్పడింది. బ్రిటీష్ ప్రభుత్వంలో లేదా వారి ఆధ్వర్యంలోని పరిశ్రమల్లో పనిచేసిన వారు ఎక్కువ మొత్తం వెనకేసుకోగలిగారు. మిగిలినవారు పేదరికంలో కొట్టుమిట్టాడుతుండటంతో జాతీయాదాయంలో వీరిది తక్కువ వాటాగా ఉండేది. దీనికితోడు తయారీ పరిశ్రమలు చాలా తక్కువ ఉండటంతో ఉపాధి కోసం ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడ్డారు.
స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పేదరికం, నిరక్షరాస్యతలు దేశానికి రెండు ప్రధాన సమస్యలుగా పరిణమించాయి. ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. 1947కి ముందు దేశ ఆదాయంలో 95 శాతం వ్యవసాయం ద్వారానే సమకూరేది. దాదాపు 85 శాతం జనాభా సేద్యంపై ఆధారపడి జీవించేవారు. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు బ్రిటిష్ పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో స్వాతంత్ర్యం నాటికి జనాభాలో 72 శాతం వ్యవసాయంలో, 10.2 శాతం తయారీలో మరియు 17 శాతం సేవా మరియు వాణిజ్య రంగాలలో నిమగ్నమై ఉన్నారు.
స్వతంత్ర భారత్ మొదటి బడ్జెట్‌ను నవంబర్ 26న RK షణ్ముగం చెట్టి సమర్పించారు. ఆ సమయంలో దేశ ఆదాయం 171.15 కోట్లు కాగా వ్యయం 197.29 కోట్లుగా అంచనా వేయబడింది. ఆర్థిక లోటు 24.59 కోట్లు. అప్పుడు రక్షణ రంగ వ్యయం కేవలం 92.74 కోట్లు మాత్రమే. దేశాన్ని వృద్ధి పథంలో పరిగెత్తించేందుకుగాను ఉత్పత్తిని పెంచడం, విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ మరియు ఇతర రంగాల అభివృద్ధి కోసం అప్పటి పాలకులు చర్యలు చేపట్టారు. పంచవర్ష ప్రణాళికలు, హరిత విప్లవం మరియు ప్రపంచీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడింది. అతి త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications